నేటి నుంచి.. ఇంటి వద్దకే పింఛను ‘వైయస్సార్ పింఛను కానుక’ ద్వారా లబ్ధిదారులకు ఇంటివద్దకే పింఛన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇవాల్టి నుంచి వైకాపా సర్కారు ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. తొలుత పింఛన్లను ఇంటివద్దకే వెళ్లి అందివ్వనుంది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల 64 వేల మంది లబ్ధిదారులకు అధికారులు ఇంటివద్దకే వెళ్లి పింఛన్ ఇవ్వనున్నారు.
వారి పేరుతో బ్యాంకు ఖాతాలు
గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ నెల నుంచి సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం, లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేసింది. పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీర్‌కు స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్లలో బయోమెట్రిక్ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అధికారులు పింఛన్లను ఇంటివద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నానికి చెల్లింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఎక్కడైనా బయోమెట్రిక్ సమస్య ఉత్పన్నమైతే, సరిచేసి మర్నాటికల్లా పింఛను చెల్లిస్తారు.
ఇవాల్టి చెల్లింపుల కోసం 1320 కోట్ల రూపాయలు
పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాది 15 వేల 675.20 కోట్లు కేటాయించగా, ఇవాల్టి చెల్లింపుల కోసం 1320.14 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల్లో అర్హులకు రూ.2250 పింఛను ఇస్తారు. అదే విధంగా వృద్ధాప్య పింఛన్ల చెల్లింపునకు కనీస వయస్సు గతంలో 65 ఏళ్లు ఉండగా, దాన్ని 60 ఏళ్లకు తగ్గించారు. దివ్యాంగులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా 3 వేల పెన్షన్ ఇస్తున్నారు. తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, తీవ్ర హీమోఫీలియాతో బాధ పడుతున్న వారికి రూ.10వేల పెన్షన్, తీవ్ర బోధకాలు వ్యాధితో బాధ పడుతున్న వారికి, తీవ్ర పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన వారికి, తీవ్ర కండరాల క్షీణతతో కదల్లేని పరిస్థితిలో ఉన్న వారికి, ప్రమాదాల బారిన పడి శరీరం సహకరించని స్థితిలో చక్రాల కుర్చీకి లేదా మంచానికి పరిమితమైనవారికి నెలకు 5 వేల చొప్పున పెన్షన్ మంజూరు చేశారు. అలాగే డయాలసిస్ చేయించుకోకుండా తీవ్ర కిడ్నీ వ్యాధి అడ్వాంటేజ్ స్టేజిలో ఉన్న వారికి అంటే.. స్టేజ్ 3,4,5 పరిస్థితిని ఎదుర్కొంటున్నవారికి నెలకు 5వేల చొప్పున పింఛన్ ఇస్తున్నారు.
మిగిలిపోయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
వైయస్సార్ నవశకం కార్యక్రమం ద్వారా పారదర్శకంగా అర్హులను గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ వాలంటీర్లు ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి... దరఖాస్తులను స్వీకరించారని..అధికారవర్గాలు తెలిపాయి. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. మిగిలిపోయిన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునేలా అక్కడే సమాచారాన్ని పొందుపరిచినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: