ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Governor Tamilisai On Trolling: 'మహిళను ట్రోల్‌ చేయడం తగునా?' - Governor Tamilisai On Trolling

Governor Tamilisai On Trolling: ప్రజల చేత ఎన్నికైనందున తామే అధికులమనే భావన సరికాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తనకు అందిన సమాచారాన్ని కేంద్రానికి నివేదికల రూపంలో పంపుతానని స్పష్టం చేశారు. మహిళను ట్రోల్‌ చేయడం తగదని పేర్కొన్నారు.

Governor Tamilisai On Trolling
Governor Tamilisai On Trolling

By

Published : Apr 19, 2022, 12:25 PM IST

Governor Tamilisai On Trolling: ‘ప్రతిపక్షాలతో పాటు ఇతర మార్గాల్లో నాకు అందిన సమాచారాన్ని నివేదికల రూపంలో కేంద్రానికి, సంబంధిత శాఖలకు పంపుతా... అది నా బాధ్యత.. ఆ తర్వాత ఏం చేయాలో కేంద్రం అది చేస్తుంద’ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్‌ నేతల వినతిని సంబంధిత శాఖకు పంపించానని చెప్పారు. దిల్లీలో సోమవారం ఆమె విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.‘‘ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు వింటే ప్రజలు నా దగ్గరకు ఎందుకు వస్తారు.? నేను మహిళను, వైద్యురాలిని కనుక స్త్రీలు తమ సమస్యలు చెప్పుకోవడానికి రావచ్చు. ప్రజల చేత ఎన్నికైనందున మేమే అధికులమని, కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌ ఫిర్యాదులు స్వీకరించడం ఏమిటనే భావన సరికాదు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తప్పా. 1/70 చట్టం ప్రకారం గిరిజనుల ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం దాడులతో తెలంగాణకు వచ్చి ఆశ్రయం పొందుతున్న గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాను. నాగర్‌కర్నూల్‌లోని అటవీ ప్రాంత వాసులు టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. అటవీ అధికారులతో మాట్లాడా. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నాను. అందులో 79 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అక్కడ ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సూచించాను.

నా బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తా..:నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తాను.. మా అమ్మ చనిపోయినప్పుడు మూడు రోజులు మినహా ఏ రోజూ సెలవు తీసుకోలేదు. నా సమర్థతపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పూర్తి విశ్వాసం ఉంది. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా (పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌)నియమించారు. నా విధుల విషయంలో తలకు రాయి తగిలి రక్తం కారుతున్నా వెనకడుగు వేయను. కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదికల వివరాలు బయటకు వెల్లడించను.. వెల్లడించకూడదు.రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక రేసులో మీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.

కేంద్ర మనిషిగా భావిస్తే ఏం చేయలేను..:నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తిని వారు తెరాసలోకి తీసుకొని తెల్లారేసరికి ఎమ్మెల్సీ ఇవ్వవచ్చు. ఆయన తెరాస వ్యక్తిగా మారిపోయినట్లు భావిస్తున్నారు. నేను భాజపాలో పని చేసిన మాట వాస్తవం. రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ పదవిలో ఉన్నప్పుడు గవర్నర్‌గా ఎందుకు భావించరు. భాజపా వ్యక్తి అని ఎలా అంటారు. విపక్షాలతో పోరాడినట్లు గవర్నర్‌తో పోట్లాడడం సరికాదు. గవర్నర్‌, ముఖ్యమంత్రి కార్యాలయాల మధ్య పరస్పరం గౌరవం అవసరం. కేంద్రంతో వారికి (ముఖ్యమంత్రిని ఉద్దేశించి) సరైన సంబంధాలు లేవు కాబట్టి గవర్నర్‌ను కేంద్ర మనిషిగా భావిస్తే నేనేం చేయలేను. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య దూరాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఇంకా పలు అంశాలపై వస్తున్నవి ఊహాగానాలే. తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకకు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. తమిళనాడు రాజకీయాల ప్రభావంతో విపక్ష కాంగ్రెస్‌, డీఎంకేతో పాటు ఇతర పార్టీల నేతలు హాజరుకాలేదు. ప్రొటోకాల్‌ విషయంలో నిద్రపోయే వారిని లేపొచ్చు.. నిద్రపోయినట్లు నటించే వారిని లేపలేం. ఇటీవల భద్రాచలం పర్యటనకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ కల్పించలేదు. పూర్తిగా నక్సల్‌ ప్రభావిత ప్రాంతంలోని పర్యటన విషయంలో ప్రొటోకాల్‌ కన్నా భద్రతాంశం కీలకం. ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది.

పాత ఫొటోలతో ప్రచారమా..?:గవర్నర్‌ రాజకీయం చేస్తున్నారని తెరాస మంత్రులు, నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు సరికాదు. ప్రొటోకాల్‌పై మాట్లాడితే నా పాత ఫొటోలకు నామాలు పెట్టి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేశారు. వారి ప్రచారాలకు సామాన్యులే కౌంటర్‌ ఇచ్చారు. ఓ మహిళను అలా అవమానించడం తగునా’’ అని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నేడు విశాఖలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన.. హరియాణా సీఎంతో భేటీ

ABOUT THE AUTHOR

...view details