FLAG HOSTING GOVERNOR: రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి పెరుగుతుందని గవర్నర్ వివరించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు.
ఉద్యోగులకు మంచి పీఆర్సీ
‘రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటు, కొవిడ్ కారణంగా సొంత వనరులు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పీఆర్సీని ప్రకటించింది. 23% ఫిట్‌మెంట్ ప్రయోజనం కల్పించడంతోపాటు ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు, గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 27% ఐఆర్ మంజూరు చేసింది. ఆర్థిక సమస్యలున్నా 11వ వేతన సవరణ కమిషన్‌ను అమలు చేస్తున్నాం. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.10,247 కోట్ల ఆర్థిక భారం పడనుంది’ అని గవర్నర్ పేర్కొన్నారు.
32 నెలల్లో ప్రజలకు రూ.1,67,798 కోట్లు పంపిణీ
‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ), ప్రత్యక్షేతర ప్రయోజన బదిలీ విధానంలో 32 నెలల్లో రికార్డు స్థాయిలో 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్లు పంపిణీ చేశాం’ అని అన్నారు.
‘వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు ఇప్పటి వరకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. అమూల్ భాగస్వామ్యంతో రైతుకు లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 అదనపు ఆదాయం వస్తోంది’ అని గవర్నర్ వివరించారు.
పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ‘నాడు- నేడు’
‘విద్య పథకాల కింద ఇప్పటి వరకు 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల లబ్ధి చేకూర్చాం. మన బడి నాడు-నేడు పథకంలో రూ.16,025 కోట్లు వెచ్చించి పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైఎస్‌ఆర్ పింఛన్ కానుక కింద ఇప్పటివరకు రూ.45,837 కోట్లు సమకూర్చాం. విడతల వారీగా పెంచుతూ నెలకు రూ.3 వేల పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హరిచందన్ అన్నారు.
కొప్పర్తిలో మెగా పారిశ్రామిక హబ్