రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 9వేల మందికి పైగా ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్దం చేస్తుంది. విడతల వారీగా రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలను నిర్మించనున్నారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు నిర్మిస్తామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 2,112 వైద్యులు జనరల్ మెడిసిన్ పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. మంజూరైన పోస్టుల్లో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేపట్టనున్నారు.
నూతనంగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు అదనంగా మరో ఏడాది ప్రొబేషనరీ పిరియడ్ ఉండే విధంగా ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్ ,ఫార్మసిస్టుల నియామకాలు సైతం చేపట్టనున్నారు. వీరిని వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకుల పరిధిలో నియమించనున్నారు. తమిళనాడులో ఉన్న మాదిరిగానే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి నియమించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుత విధానం ద్వారానే వైద్యుల భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.