రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం తమదేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించడంలో తమకు ఎలాంటి పాత్రా లేదని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం కూడా స్పష్టంచేసిందని తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు 2018లో దాఖలు చేసిన పిటిషన్, ఆ తర్వాత దాఖలైన అనుబంధ పిటిషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు ఈ అఫిడవిట్ వేశారు. సీఆర్‌డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధికి రెండు చట్టాలు తెచ్చామని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అక్కడి నుంచి కార్యాలయాలను, సంస్థల్ని తరలించకుండా ఆదేశించాలని వేసిన అనుబంధ పిటిషన్ పరిశీలనార్హం కాదని పేర్కొంది. రాజధాని సహా అభివృద్ధి ప్రణాళికల్ని, ప్రాజెక్టుల్ని ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సమీక్షించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని వివరించింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం (ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్టు), బెంచ్‌ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనలు.. మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ నారాయణ్ శ్యామ్‌రావు పురాణిక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు, రాష్ట్ర విభజన చట్టంలోని 30, 31 సెక్షన్లకు విరుద్ధం కాదని పేర్కొంది.
ప్రత్యేక హోదా ఇస్తేనే...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చేంతవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు కాదని హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ‘‘ప్రత్యేక హోదా డిమాండ్‌ని మేం విడిచిపెట్టలేదు. కేంద్ర ప్రభుత్వంతో జరిగే ప్రతి సమావేశంలోనూ ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం’’ అని తెలిపింది.
మైనింగ్ భూముల్లో ఇళ్ల స్థలాలు కుదరవు
ఖనిజ (మైనింగ్), నీటివనరుల సంబంధ భూముల్లో ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. స్థలాల కేటాయింపు విషయంలో అధికారులు రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని గుర్తు చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు, టంగుటూరు మండలాల పరిధిలోని సర్వేరెడ్డిపాలెం, యర్రజెర్ల, మర్లపాడు, కొణిజేడు తదితర గ్రామాల్లో 1307 ఎకరాల మైనింగ్ భూముల్లో ఇళ్లపట్టాలిచ్చే యత్నంపై స్టే ఇచ్చింది.
రైతుల హక్కులకు భంగం కలగదు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్లో రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను రక్షించామని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామమనోహరరావు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కొత్త చట్టాలతో రైతుల హక్కులకు భంగం వాటిల్లబోదన్నారు. కార్యాలయాల తరలింపుపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులివ్వడంతో పాటు ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు అవకాశమిస్తూ విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి హైకోర్టులో కౌంటర్ వేశారు.
'రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం మాదే' - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
హోదా రానంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉంటుంది: ప్రభుత్వం
18:16 August 13
రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా అనేది అంతర్భాగమని ప్రభుత్వం పేర్కొంది. హోదా రానంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన అంశాలపై పి.వి.కృష్ణయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ఉటంకించింది.
Last Updated : Aug 14, 2020, 11:36 AM IST