ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడే పేరుకుపోతున్న చెత్తకుప్పలు.. వాటి నుంచి వెలువడే దుర్గంధంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మార్కెట్లు, దుకాణ సముదాయాల దగ్గరే కాదు ప్రధాన వీధులు, కాలనీల్లోనూ చెత్తకుండీలు నిండిపోయి వ్యర్థాలు ఆ ప్రాంతమంతా నిండిపోయాయి. వాననీరు, గాలులకు ఇదంతా మురుగుకాల్వల్లోకి చేరి ప్రవాహానికి అడ్డుపడుతోంది. కూరగాయలు, పండ్ల మార్కెట్లున్న చోట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నడవడానికి కూడా దారి లేనంతగా చెత్త నిండిపోయిన మార్కెట్లు విశాఖ, విజయవాడ సహా చాలా నగరాల్లో కనిపిస్తున్నాయి. నెలకు రూ.21 వేల వేతనమివ్వాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని నాలుగు రోజులుగా ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. శాశ్వత కార్మికులతో పనులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నా.. పోగయ్యే చెత్తలో పదో శాతం కూడా తొలగించలేకపోతున్నారు. ‘ఈనాడు’ బృందం గురువారం రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో పరిశీలించగా.. ఎక్కడ చూసినా కుప్పలుకుప్పలుగా.. గుట్టలు గుట్టలుగా పోగు పడిన చెత్తే కనిపించింది. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఎంత ఇచ్చినా తక్కువేనని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారని.. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
'చెత్త'కుప్పల్లా పట్టణాలు.. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ప్రజలకు అవస్థలు - Garbage accumulating in cities
పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పట్టణాలు చెత్త కుప్పల్లా మారిపోయాయి. నగరాలు, పట్టణాల్లో వ్యర్థాలు గుట్టల్లా పేరుకపోయాయి. ఎక్కడికక్కడే పేరుకుపోతున్న చెత్తకుప్పలు.. వాటి నుంచి వెలువడే దుర్గంధంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మార్కెట్లు, దుకాణ సముదాయాల దగ్గరే కాదు ప్రధాన వీధులు, కాలనీల్లోనూ చెత్తకుండీలు నిండిపోయి వ్యర్థాలు ఆ ప్రాంతమంతా నిండిపోయాయి. వాననీరు, గాలులకు ఇదంతా మురుగుకాల్వల్లోకి చేరి ప్రవాహానికి అడ్డుపడుతోంది.
చెత్త సేకరణకు ‘సమ్మె’ట పోటు:సమ్మె చేస్తున్న కార్మికులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇళ్ల నుంచి చెత్త సేకరించే వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో అధికారులు వీటిని డంపింగ్‌యార్డులకే పరిమితం చేస్తున్నారు. ఇది ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 42 నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరించేందుకు 2,163 వాహనాలు కేటాయించారు. పుర, నగరపాలక సంస్థలు ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాయి. వాహనం సమకూర్చి తిప్పుతున్నందుకు ప్రైవేట్ ఏజెన్సీకి నెలకు రూ.65 వేల చొప్పున చెల్లిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడంతో వాహనంతోపాటు డ్రైవర్ మాత్రమే మిగిలారు. వీరు సమ్మె ప్రారంభమైన మొదటి రెండు రోజులూ వాహనాన్ని వీధుల్లో తిప్పారు. కార్మికులు రెండు రోజులుగా యార్డుల్లోని వాహనాలు బయటకు తీయకుండా అడ్డుకుంటున్నారు. విశాఖ, ఒంగోలులో కొందరు డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
- విశాఖలో 605 చెత్త సేకరణ వాహనాల్లో గత రెండు రోజులుగా 25 శాతం కూడా వీధుల్లోకి రాలేదు. గురువారం అతికష్టం మీద 150 వాహనాలను వీధుల్లో తిప్పి తాత్కాలిక కార్మికులతో ఇళ్ల నుంచి చెత్త సేకరించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
- కడపలో 70 వాహనాలు యార్డులకే పరిమితమయ్యాయి.
- అనంతపురం నగరపాలక సంస్థలో వాహనాలను బయటకు తీయడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు.
- విజయవాడలో 225 వాహనాల్లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి కొన్ని డివిజన్లలో తిప్పుతున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకోవడంతో అన్ని ప్రాంతాలకు పంపలేకపోతున్నారు.
- ఒంగోలు నగరపాలక సంస్థలో 60 వాహనాల్లో ఒక్కటి కూడా వీధుల్లోకి రాకపోవడంతో ఇళ్ల నుంచి చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయింది.
- నెల్లూరు వీధుల్లో తాత్కాలిక, శాశ్వత కార్మికులతో వాహనాలు తిప్పుతున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులు బుధవారం మూడుచోట్ల వాహనాల టైర్లలో గాలి తీసేసి, అంతరాయం కలిగించారు.
ఇవీ చూడండి