తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీలో మూడ్రోజుల ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో రెండు దఫాలుగా చర్చల అనంతరం వైద్యులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారం సాయంత్రం గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగి చనిపోవటం వల్ల గొడవ ప్రారంభమైంది. మృతుని కుటుంబీకులు విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిని కుర్చీలతో కొట్టడంపై జూడాలు ఆగ్రహించారు.
మూడు నెలలపాటు కష్టపడి కరోనా రోగులకు చికిత్స అందించిన తమపై ఇలాంటి దాడులు అమానుషమంటూ జూడాలు సమ్మెకు దిగారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గాంధీలో చికిత్సలు తీసుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పలేదు. బుధవారం సైతం జూడాలు రోడ్డెక్కి నిరసన గళాలు వినిపించారు. ఏకంగా మంత్రే దిగివచ్చి చర్చలకు రమ్మన్నా... జూడాలు సమ్మె విరమించలేదు. మంత్రి ఈటల స్వయంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి జూడాలతో చర్చలు జరిపారు. అప్పటికీ వారు సంతృప్తి చెందక.. గురువారం కూడా సమ్మెను కొనసాగించారు.
గురువారం రాత్రి మంత్రి ఈటల మరోసారి భేటీ అయి చర్చించగా జూడాలు సంతృప్తి చెందారు. ప్రజారోగ్యం, మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. జూడాలు మంత్రికి ప్రధానంగా ఐదు డిమాండ్లను వినిపించగా అన్నింటికి ఈటల సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.