ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాలుగోరోజు అమరావతి మహా పాదయాత్ర.. అడుగడుగునా ఘనస్వాగతం

4th day Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉద్ధృతంగా సాగుతోంది. సకల వర్గాల ప్రజలు పోరాటానికి అండగా నిలుస్తున్నారు. నాలుగోరోజు గ్రామాల్లో ప్రజలు ఎదురేగి స్వాగతించారు. రాష్ట్రం కోసం రైతులు చేస్తున్న అలుపెరగని ఉద్యమానికి తాము సైతం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ వెనక్కి తగ్గొద్దని దీవెనలు అందిస్తున్నారు ప్రజలు.

Amaravati Farmers Maha Padayatra
రైతుల పాదయాత్ర

By

Published : Sep 15, 2022, 9:59 AM IST

Updated : Sep 15, 2022, 8:34 PM IST

4th day Amaravati Farmers Padayatra: రాజధాని రైతుల మహాపాదయాత్ర నాలుగో రోజున గుంటూరు జిల్లా పెదరావూరు నుంచి మొదలైంది. పెదరావూరులో రైతులు బసచేసిన ప్రాంతం వద్ద ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు. రాజధాని రైతులతోపాటు స్థానికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారూ యాత్రలో పాల్గొన్నారు.

జంపని గ్రామం వద్ద గుంటూరు జిల్లా నుంచి పాదయాత్ర బాపట్ల జిల్లాలో ప్రవేశించింది. అక్కడ రైతులకు ఘన స్వాగతం లభించింది. జంపని గ్రామస్థులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు వందలాదిగా మహా పాదయాత్రలో జత కలిశారు. పాదయాత్ర మార్గంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వాగతం పలికారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని రైతులు విమర్శించారు.

బాపట్ల జిల్లాలో పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో సాగుతోంది. జైజై అమరావతి అంటూ నినాదాలు.. పాదయాత్ర మార్గంలో ప్రతిధ్వనించాయి. మధ్యాహ్నం 2 గంటలకు పాదయాత్ర వేమూరుకు చేరుకోగా.. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి యాత్ర కొనసాగింది. రాజధాని విషయంలో జరిగిన అన్యాయాన్ని రైతులు..ప్రజలకు వివరిస్తూ ముందుకు కదిలారు.

మధ్యలో వైకాపా నేతలు 3 రాజధానులకు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై మండిపడ్డ రైతులు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే 3 రాజధానులని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారు అక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఐకాస నేతలు తీవ్రంగా నిరసించారు.

రైతుల పాదయాత్రలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయటం ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని.. ఈ విషయం తెలిసీ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టడం ఏంటని నిలదీశారు. నాలుగో రోజు కొల్లూరులో ముగిసిన రైతుల పాదయాత్ర శుక్రవారం.. అక్కడి నుంచి ప్రారంభం కానుంది.

నాలుగోరోజు అమరావతి మహా పాదయాత్ర.. అడుగడుగునా ఘనస్వాగతం


ఇవీ చదవండి:

Last Updated : Sep 15, 2022, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details