గోదావరికి జులైలోనే వరద మొదలవుతుంది. మిగిలి ఉన్న సమయం తక్కువే. ఇప్పటికే గోదావరిలో ప్రవాహం వెనక్కి మళ్లి.. కుక్కునూరు, వేలేరుపాడు, వరరామచంద్రాపురం మండలాల్లో రెండు జిల్లాలను తాకేలా నిలిచి ఉన్నాయి. గతంలో వేసవిలో ఈ గట్టు నుంచి ఆ గట్టుకు నీళ్లలో నడుచుకుని వెళ్లేలా ఉండేది. ఇప్పుడు కాఫర్ డ్యాం అడ్డుకట్టతో పరిస్థితి మారిపోయింది. పోలవరం వద్ద వెనక్కి 30 కిలోమీటర్ల మేరకు నీళ్లు నిలిచాయి. ఇప్పటికే అప్రోచ్ ఛానల్ తవ్వకం కొంతమేర చేపట్టారు. ఆ మార్గంలోనే నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల గతేడాది కన్నా ఏజెన్సీ గ్రామాల్లో 6 మీటర్లు అధికంగా వరద నిలిచే ఆస్కారం ఉందని రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు పునరావాస ప్యాకేజీ మొత్తం ఇవ్వలేదని ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయడం లేదు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు వరద సమయంలో రక్షణ కోసం ఎగువ ప్రాంతాలకు వెళ్లి తాత్కాలికంగా ఆవాసాలు నిర్మించుకుంటున్నారు. వీఆర్‌పురం మండలంలోని జీడిగుప్ప, తుమ్మిలేరు పోచవరం, శ్రీరామగిరి గ్రామాల ప్రజలు సమీప గుట్టలపై, రాజుపేట, వడ్డిగూడెం గ్రామాలకు చెందినవారు సుద్దగూడెం పరిసర ప్రాంతాల్లో తుప్పలు తొలగించి వెదురుపాకలు వేసుకుంటున్నారు. వరద తగ్గిన తర్వాత తిరిగి తమ గ్రామాలకు వెళ్తామంటున్నారు.
రూ.2,748 కోట్లు అవసరం
తరలింపునకు ఇంకా రూ.2,748 కోట్లు అవసరమవుతాయని లెక్కించారు. పునరావాస కాలనీల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కోసం తొలి దశలోనే రూ.1,497.42 కోట్లు అవసరమని తేల్చారు. పునరావాస ప్యాకేజీ కింద ఈ కుటుంబాలకు మొత్తం రూ.1,094 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇంకా వీరికి భూసేకరణ నిమిత్తం రూ.155 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.