Floods: గోదావరి వరద ప్రజలను కుదుటపడనివ్వటం లేదు. గోదావరి మహోగ్రరూపం దాల్చటంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో వరద జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 20.60 అడుగులగా కొనసాగుతోంది. ఇంకా ప్రవాహం పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వరద యధవిధిగా కొనసాగితే, 44 మండలాల్లోని 628 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముండంతో.. చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమాలోచన చేస్తున్నారు.
ఇప్పటివరకు 42 మండలాల్లోని 279 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని అధికార్లు లెక్కతేల్చారు. 10 ఎన్డీఆర్‌ఎఫ్, 10 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు.. కీలక శాఖల ఆధ్వర్యంలో సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి. వరద బాధితులు లంక గ్రామాల నుంచి ఏటిగట్లను ఆశ్రయిస్తున్నారు.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 21.32 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మద్యహ్నంకు 25 లక్షల క్యూసెక్కులు చేరే అవకాశముంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటివరకు బ్యారేజీ నుంచి పంటకాల్వలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సముద్రంలోకి 23.94 లక్షల క్కూసెక్కులు విడిచిపెట్టారు.
కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం కనిపిస్తోంది. అల్లూరి జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలోని 4 మండలాలపై వరద ప్రభావం పడనుంది. ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాల కూడా ముంపు బారిన పడే అవకాశముంది. ఇప్పటివరకు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు.
కోనసీమ..జిల్లాలోని ఐ.పోలవరం మండలంలో ఏటిగట్టు బలహీనంగా మారింది. కాగా.. ఏటిగట్టుకు గండి పడే అవకాశం ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. పశువుల్లంక అన్నంపల్లి అక్విడేట్ వద్ద ఏటిగట్టు మారగా.. పి.గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వరద ముంపులో ఉంది.