గోదావరికి వరద రోజులు వచ్చేస్తున్నాయి. పోలవరం ముంపు గ్రామాల్లో బతుకు బితుకు బితుకుమంటోంది. కాఫర్ డ్యాం పూర్తి అడ్డుకట్టగా నిర్మించక ముందే రోజుల తరబడి గ్రామాల్లో నిలిచిపోయిన వరద... వారి జీవనాన్ని ఛిద్రం చేసేసింది. ఇప్పుడు ఎగువ కాఫర్ డ్యాంను పూర్తిస్థాయిలో అడ్డుకట్టగా నిర్మించారు. ఎత్తు పెంచే పనుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం ముంపు ఏర్పడే వందల గ్రామాల్లోను, ఇంకా ఎగువన కూడా ఈ భయం వెంటాడుతోంది. ఏయే గ్రామాలు మునిగిపోతాయని ప్రజల్లో ప్రశ్నలు... చర్చలు సాగుతున్నాయి.
రాదనుకున్న గ్రామాల్లోకీ ముంపు వచ్చి చేరిన గతేడాది అనుభవంతో కాంటూరు లెక్కలపై నిర్వాసితుల్లో నమ్మకం కొంత తగ్గింది. కాఫర్ డ్యాంతో ముంపు పెరుగుతుందనే అంచనాలు, పునరావాసం పూర్తికాక ఇక్కట్లు అక్కడి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఒకవైపు ప్రాజెక్టులో కాఫర్ డ్యాం ఎత్తు పెంచి గోదావరికి అడ్డుకట్ట వేసేశారు. మరోవైపు పునరావాసం ఒకింత కూడా ముందుకు కదల్లేదు. ముంపు పెరుగుతుందనీ ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. +45.72 మీటర్ల స్థాయి వరద ఊహించిన ప్రాంతంలోనూ 2020 వరదకే ముంపు ఏర్పడిందని అదే అధికారులు లేఖలు రాస్తున్నారు. 2022 మధ్యవరకూ పునరావాసం పూర్తి చేయలేమని, ఇంకా సర్వేలు పూర్తి చేయాలని పునరావాస అధికారులే అంటున్నారు.
పునరావాస ప్యాకేజీలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టకుండా, భూమికి భూమి చూపించకుండా చట్ట ప్రకారం చేయాల్సినవి ఏమీ చేయకుండా మా ఊళ్లలో ముంపు సృష్టిస్తే ఎలగని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రకృతి విపత్తుల చట్టం కింద ఆ ఊళ్లు ఖాళీచేయాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు గతంలో ‘వరద మాకు అలవాటే వస్తుంది, వెళ్లిపోతుంది’ అనేవారు. గతేడాది వరద ముంపు గోదారమ్మ చెంతనే ఉన్న ప్రజలనూ భయపెట్టింది. రోజుల తరబడి ఊళ్లలో ముంపు నిలిచిపోయింది. దీంతో కాఫర్ డ్యాం ప్రభావం అర్థమయింది. ఇప్పుడు దాన్ని పూర్తి అడ్డుకట్టగా వేయడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఊరు నుంచి వెళ్దామంటే అక్కడేమీ లేవు. ఇస్తామన్న ప్యాకేజీలు అందరికీ దక్కలేదు. తాత్కాలిక పునరావాస శిబిరాల్లో రోజుల తరబడి ఎలా ఉండాలని అంటున్నారు.
ముంపు తగ్గాక.. ఆ ఇళ్లలో ఉండటానికి వారికి అయ్యే వ్యయప్రయాసలు మరో అంశం. ముంపు భయంతో ఇటు ఉండలేక, సాయం అందలేదన్న బెంగతో అటు వెళ్లలేక నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడో ఛత్తీస్‌గఢ్ సమీపంలోని కుంట నుంచి కూడా తమకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని పునరావాస కార్యక్రమాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు చెబుతూ ముంపు గ్రామాల్లో ఆందోళన ఏ స్థాయిలో ఉందో వివరిస్తున్నారు.
పునరావాసం నిల్వకు ముందా.. తర్వాతా?
ఒక నదిపై ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అక్కడ ముంపులో చిక్కుకునే గ్రామాల ప్రజలకు అవసరమైన ప్రత్యామ్నాయ జీవనం, ఆవాసం కల్పించాలి. అవన్నీ అయ్యాకే ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టాలి. క్రమేణా జలాశయం నీటి నిల్వ పెంచాలి. తాంబూలాలు ఇచ్చేశాం అన్న సామెతలా... కాఫర్ డ్యాం కట్టేశాం... ఇక మీ సంగతి మీరు చూసుకోండి అన్నట్లు వ్యవహారం మారిందని విమర్శలు వస్తున్నాయి.
నీరు నిల్వ చేయకపోయినా ముంపు ముప్పే
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం నీరు నిల్వచేసే యోచన లేదని, వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వదిలేస్తామని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ వరద స్థాయిని బట్టి పోలవరం వద్ద జలాశయంలో నీటి నిల్వ ఉంటుందని లెక్కలు కట్టారు. కాఫర్ డ్యాంతో అడ్డుకట్ట కట్టి 25.72 మీటర్ల క్రస్టు స్థాయి నుంచి అన్ని గేట్లూ తెరిచి మొత్తం వరదను వదిలేస్తున్నా పోలవరం జలాశయం వద్ద నీటినిల్వ పెరుగుతుంది. గడిచిన రెండేళ్లలో ఈ అనుభవం నిర్వాసితులకు ఎదురయింది. అంతే కాదు, స్పిల్ వే నుంచి ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు వదిలితే పోలవరం జలాశయం వద్ద ఎంత ఎత్తున నీటిమట్టం ఏర్పడుతుందో లెక్కలు వేశారు. ఆ నీటి మట్టం ఆధారంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఎప్పుడెప్పుడు ఏయే గ్రామాలు మునుగుతాయో జాబితా తయారుచేసి రెవెన్యూ అధికారులకు జలవనరులశాఖ అధికారులు అందజేశారు. అంటే 25.72 మీటర్ల స్థాయిలోనే పోలవరం వద్ద నీరు నిల్వ ఉంటుందనుకుంటే సరికాదు. వరద వచ్చే స్థాయిని బట్టి ముంపు ఉంటుంది. ఉదాహరణకు 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలితే పోలవరం వద్ద 38.42 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంటుందని అంచనా. 30 లక్షల క్యూసెక్కుల వరద ఉంటే అది 40 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. ఆ ప్రకారం ఆయా గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. ఈ విషయాలపై జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ వివరణ తీసుకోవడానికి ఫోనులో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ఇంకా పునరావాసం ఇలా పెండింగు...
పునరావాస ప్రణాళికను రెండు దశల్లో రచించారు. +41.15 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ ప్రకారం తొలిదశ, +45.72 మీటర్ల స్థాయిలో నీటి నిల్వను రెండోదశగా విభజించి ఆ ప్రకారంపనులు చేయాలని నిర్ణయించారు. జులై నుంచి గోదావరికి వరదలు వస్తాయి. ఆగస్టులో గరిష్ఠ వరద వస్తుందని నదీ ప్రవాహ లెక్కలు చెబుతున్నాయి.
ఇదీ తాజా దృశ్యం