పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 593వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, బోరుపాలెం, నెక్కల్లు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. జై అమరావతి అంటూ నినదించారు. ఉద్ధండరాయునిపాలెం వద్ద ఎన్10 రహదారిలో శనివారం రాత్రి కొంత మంది వ్యక్తులు కంకర ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం క్రితం.. ఇదే రహదారిలో కంకర తీసుకెళ్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఆక్షేపించారు. రాజధానిలో రహదారుల నిర్మాణానికి వేసిన ఇసుక, మట్టి, కంకర దొంగలపాలవుతున్నా పోలీసులు, అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని రైతులు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఉద్ధండరాయునిపాలెంలో భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.