farmers angry over irregularities in compensation distribution: పంటల బీమా నమోదు, నష్ట పరిహారం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల, అర్ధవీడు మండలం మాగుటూరులో గురువారం రైతు భరోసా కేంద్రానికి, సచివాలయానికి తాళం వేశారు. ముండ్లమూరులో ఏవో శ్రీధర్, వీఏఏ బాలవెంకటయ్యలతో వాదనకు దిగారు. జామాయిల్ సాగు చేసిన రైతుల పేరిట మిర్చి వేసినట్లు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఏవో వారితో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా వారు శాంతించలేదు. మాగుటూరులో బసిరెడ్డిపల్లి, సుగాలితండా, మాగుటూరు బీసీ కాలనీల రైతులు సచివాలయాన్ని ముట్టడించి, భవనానికి తాళం వేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పి తాళం తీయించారు.
పరిహారం దక్కలేదని నిరసన : కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం ఊడిమూడిలో 439 మంది రైతులు 530 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో వీరు వేసిన పంటలు దెబ్బతిన్నాయి. అయినా ఒక్కరికీ పంటల బీమా పరిహారం రాలేదు. దీనిపై మండల వ్యవసాయాధికారి ఎన్.సత్యప్రసాద్ మాట్లాడుతూ... ఊడిమూడి గతంలో కోటిపల్లిలో అంతర్గతంగా ఉండేదన్నారు. పంచాయతీగా విభజన జరిగాక గ్రామంలో పంటకోత ప్రయోగాలు చేసేందుకు అనుమతులు రాలేదన్నారు. ఈ ప్రయోగాలు జరగకుంటే బీమా పరిహారం మంజూరు కాదన్నారు.