పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామం వీరంపాలెం. రెండేళ్ల క్రితం వచ్చిన వరదల కారణంగా ఊరి నుంచి పొలాలకు వెళ్లే వంతెన కూలిపోయింది. వంతెనను తిరిగి నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. ఎదో చేస్తారని రెండేళ్లుగా ఎదురుచూశారు.. అయినా లాభం లేకపోయింది. సమస్య పరిష్కారం కోసం రైతులందరూ ఏకమయ్యారు. తాళ్ల వంతనెను నిర్మించి ఔరా అనిపించారు.
ఈదుకుంటూ పనులకు..
వంతెన నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలువలో ఈదుకుంటూ పొలాలకు వెళ్లి వ్యవసాయం చేసుకునేవారు. ఆయా పొలాల్లో వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు రాకపోవడంతో రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. దీంతో అక్కడ వ్యవసాయం అగమ్యగోచరంగా మారింది.