ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2020, 3:44 PM IST

ETV Bharat / city

'రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే కారణం'

ఓవైపు కేంద్రం తీసకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు దేశవ్యాప్తగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామంటూ ఏపీ ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ రైతు సంఘాల నాయకులు ఏపీలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు.

farmers protest
ధర్నా చేస్తున్న రైతులు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చారు. కేంద్రంలో భాజపా, ఏపీలోని వైకాపాలు అన్నదాతలను నట్టేట ముంచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలో...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నర్సీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో.. విశాఖ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అధికారంలో ఉన్న వైకాపా, భాజపాలు.. ఎన్నికలకు ముందు రైతేరాజు అంటూ గద్దెనెక్కారని గుర్తు చేశారు. ఇప్పుడు అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇరు పార్టీల పాలనలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలను కోల్పోయిన రైతాంగానికి తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.

కృష్ణా జిల్లాలో...

నూతన వ్యవసాయ చట్టాలు, పంపుసెట్లకు మీటర్లు బిగింపునకు వ్యతిరేకంగా.. కృష్ణా జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్​కు అంతరాయం కలగడంతో.. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ స్టేషన్​కు చేరుకుని.. అరెస్టైన నేతలను పరామర్శించారు. ప్రజాప్రయోజన నిరసనలకు తెదేపా మద్ధతిస్తోందని తెలిపారు. రైతులు చేస్తున్న పోరాటాలను పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో...

వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ.. శ్రీకాకుళంలో రైతులు ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఓవైపు రైతు సంఘాలు వ్యతిరేకిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ స్థానిక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులు పోరాడి సాధించుకున్న ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు.. జగన్ సర్కారు జీవో నెంబర్ 22 జారీ చేసిందని మండిపడ్డారు. కరెంట్ బిల్లులు కట్టలేక వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఉచిత విద్యుత్​ను యథాతథంగా కొనసాగించాలంటూ డిమాండ్ చేసారు. విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్​కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: దేవినేని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details