ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ వేరియంట్లతోనే కేసులు.. కానీ భయం వద్దు..!

Covid cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజల్లో కలవరం మొదలైంది. గత వారంలో పెరిగిన కేసులతో భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్యు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎగువ శ్వాసకోశ సమస్యలకే పరిమితమని సూచిస్తున్నారు. మూడు నుంచి నాలుగు రోజుల్లోనే లక్షణాలు తగ్గి సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశముందంటున్నారు.

corona
corona

By

Published : Jun 12, 2022, 9:33 AM IST

Updated : Jun 12, 2022, 9:43 AM IST

Covid cases: కరోనా మళ్లీ ప్రభావం చూపుతోంది. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం మేô కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మున్ముందు కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయనేది నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుంది? లక్షణాలు ఎన్ని రోజులుంటాయి? మొదటి, రెండో దశలో మాదిరి దాడి చేస్తుందా? బూస్టర్‌ డోసు ఎప్పుడు తీసుకోవాలి? ఎలాంటి చికిత్స అవసరం తదితర అంశాలపై పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌లోని బీఏ4, బీఏ5 వేరియంట్ల కారణంగానే కేసులు పెరుగుతున్నాయని విశ్లేషించారు. వాటి ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరడం, ఐసీయూల్లో చికిత్స తీసుకోవడం లాంటి పరిస్థితి ఉండదని తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని తెలిపారు.

వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరడం లేదు:

ప్రస్తుతం కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌లోని బీఏ4 వేరియంటే కారణమని మా ప్రయోగశాలలోని జన్యు విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్స్‌)లో గుర్తించాం. ఎగువ శ్వాస సమస్యల వరకే వైరస్‌ పరిమితమవుతోంది. ఊపిరితిత్తుల్లోకి చేరడంలేదు. ఒకట్రెండు రోజులపాటు జ్వరం, జలుబు, దగ్గు లాంటి స్వల్ప లక్షణాలు ఉండి 3-4 రోజుల్లో తగ్గిపోతాయి. దీన్ని నాలుగో దశగా చెప్పలేం. 2-3 నెలల వరకు కేసులు పెరిగే అవకాశం ఉంది. తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. ప్రతి మూడు నెలలకోసారి బూస్టర్‌ డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీలు తగ్గకుండా చూసుకోవచ్చు. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఏమీ కాదనే అతి నమ్మకం పనికి రాదు.- డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్‌, ఏఐజీ

4 రోజులకు మించి జ్వరం ఉంటే ఆసుపత్రికి:

ఒమిక్రాన్‌ బీఏ4, బీఏ5 వేరియంట్ల కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలోనూ స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. అందువల్ల రెమ్‌డెసివిర్‌, కాక్‌టైల్‌ ఔషధాలు అవసరంలేదు. జ్వరం వస్తే పారాసిటమాల్‌, దగ్గు, జలుబుకు సంబంధించిన ఔషధాలు వాడితే సరిపోతుంది. నాలుగు రోజులకు మించి జ్వరం, నీరసం, ఆక్సిజన్‌ స్థాయులు తగ్గడం లాంటి లక్షణాలుంటేనే ఆస్పత్రిలో చేరాలి. ఇప్పటికీ టీకా వేయించుకోనివారు తక్షణం వేయించుకోవాలి.-డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, ఏఐజీ

6 నెలలు దాటితే బూస్టర్‌ డోసు:

'ప్రస్తుతం కేసులు పెరుగుతున్నా ఆస్పత్రుల్లో చేరికలు లేవు. అలాగని నిర్లక్ష్యం వద్దు. రెండు డోసుల టీకా తీసుకుని ఆరు నెలలు దాటిన వారు వెంటనే బూస్టర్‌ డోసు వేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది అత్యవసరం. జన సమూహాల్లో మాస్క్‌ తప్పనిసరిగా వాడండి. పూర్తిస్థాయిలో వైరస్‌ నిరోధానికి మూడు పొరలున్న సర్జికల్‌ మాస్క్‌ ఉత్తమం. లక్షణాలు కన్పించగానే వెంటనే పరీక్షలు చేయించుకుని అప్రమత్తంగా ఉండడం వల్ల ఇంట్లో పెద్దలకు వైరస్‌ సోకకుండా చూసుకోవచ్చు.' -డాక్టర్‌ ఎంవీరావు, సీనియర్‌ ఫిజీషియన్‌, యశోద

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2022, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details