4 లక్షల రూపాయలు ఉంటే చాలు....
మీకు ఎన్ని నెలల్లో పీహెచ్‌డీ కావాలి... ఏ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ కావాలి. పీహెచ్‌డీ పొందాలంటే ఏళ్లకేళ్లకు చదవాల్సిన అవసరం లేదు. మీ పీజీ పూర్తై... కనీసం 4 లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగితే చాలు.. 6 నెలల్లోపు అత్యున్నత డిగ్రీగా చెప్పుకునే పీహెచ్‌డీ పట్టా మీ చేతుల్లోకి వస్తుందంటూ ప్రత్యేకంగా ఏజెంట్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి కన్సల్టెన్సీలు హైదరాబాద్ నగరంలో దాదాపు 10 వరకు ఉంటాయని తెలుస్తోంది.
అంగట్లో సరకు పీహెచ్‌డీ @ రూ.4లక్షలు... - fake PhD certificates scam at Hyderabad today news
పేరుకు ముందు డాక్టర్ తగిలించుకోవాలనే కల ఒకరిదైతే.. ఆ ఉన్నత విద్యార్హతతో గౌరవ ఆచార్యుడిగా పదోన్నతి పొందాలని అభిలాష మరొకరిది. ఇందుకోసం కావాల్సిన పీహెచ్‌డీ చేయాలంటే వయోభారంతో పాటు.. ధరాభారంగా మారుతోన్న పరిస్థితులు. దీన్ని అదునుగా చేసుకుంటూ.. మీ దగ్గర డబ్బుంటే చాలు హీహెచ్డీలు మేమిప్పిస్తాం అంటూ దళారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో కొన్ని నకిలీవి అయితే.. మరికొన్ని విశ్వవిద్యాలయం ద్వారానే... అడ్డదారుల్లో వచ్చే వాస్తవ పీహెచ్‌డీలు అంటే నమ్మగలరా.. దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఈ షార్ట్ కట్ పీహెచ్‌డీ పొందే రాకెట్‌పై "ఈటీవీ భారత్" నిఘా కథనం మీ కోసం...
అసలు కథ ఇలా బయట పడింది....
అన్నామలై, బెంగళూరు విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తు చేస్తే తాము సహకరిస్తామని.. హైదరాబాద్‌కు చెందిన సనా కన్సల్టెన్సీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోని అధ్యాపకులకు, పీజీ పూర్తైన విద్యార్థులకు సంక్షిప్త సందేశాలు పంపిస్తోంది. అక్కడ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. ఈ పీహెచ్‌డీ బాగోతం బయటపడింది. ఆ కన్సల్టెన్సీ నిర్వాహకుడు షేక్ సైదులు... లంగర్ హౌజ్‌లోని షాదన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆచార్యుడిగా పనిచేస్తూ ఈ దందా నిర్వహిస్తున్నాడు. షాదన్ కళాశాల సమీపంలోని ఓ బేకరీలో తాను పీహెచ్‌డీ ఎలా ఇప్పించేది.. పూస గుచ్చినట్లు చెప్పాడు.
- ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ఏజెంట్లను నియమించుకొని పీహెచ్‌డీ పట్టాలు అమ్ముకుంటున్నాయి. ఈ పీహెచ్‌డీ వ్యవహారంతో అంతా... యూపీలోని శ్రీ వెంకటేశ్వర ప్రైవేటు విశ్వవిద్యాలయం ద్వారా జరుగుతోంది. విశ్వవిద్యాలయంకు రెండున్నర లక్షలు, కన్సల్టెన్సీ ఫీజు లక్షన్నర.. ప్రయాణఖర్చులు పెట్టుకుంటే.. ఇక అంతా తాను చూసుకుంటా అంటున్నాడు.
ఇలా కన్సల్టెన్సీల ద్వారా ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీ పట్టాలను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై అప్పుడప్పుడు కొందరు ఫిర్యాదు చేస్తుండటంతో జేఎన్‌టీయూహెచ్ గతేడాది అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి పీహెచ్‌డీల పై ఆరా తీసింది. అది లోతుగా జరగకపోవటంతో చాలామందికి చెందిన నకిలీ పీహెచ్‌డీలు బయటపడలేదు. ఈ క్రమంలోనే పీహెచ్‌డీ కొనుగోళ్లపై ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్ రంగంలోకి దిగటంతో తత్కాల్ పీహెచ్‌డీల వ్యవహారం బయటపడింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కేటుగాళ్ల పై నిఘాపెట్టి కష్టపడి చదివే వారికి న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.