ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమెరికా ముందే మేల్కోవాల్సింది: న్యూయార్క్ వైద్యులు డా.వెంకట్​

కరోనా విలయంతో ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారిపోయింది. ఇన్నాళ్లు ఉద్యోగం, ఉపాధి అంటూ ఉరుకులు పరుగుల జీవితం గడిపిన ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక రాత్రి, పగలూ తేడా ఉండని న్యూయార్క్​ మహానగరం సైతం మృత్యు కుహరంగా మారిపోయి శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో పనిచేస్తున్న ప్రముఖ వైద్యులు వెంకట్​ చింతగుంపులతో ఈటీవీ భారత్ ప్రతినిధి వల్లభనేని రంగారావు ప్రత్యేక ఇంటర్వ్యూ.

By

Published : May 3, 2020, 4:23 PM IST

అమెరికా ముందే మేల్కోవాల్సింది : న్యూయార్క్ వైద్యులు  డా.వెంకట్​
అమెరికా ముందే మేల్కోవాల్సింది : న్యూయార్క్ వైద్యులు డా.వెంకట్​

ప్రముఖ వైద్యులు వెంకట్​ చింతగుంపులతో ఈటీవీ భారత్ ప్రతినిధి వల్లభనేని రంగారావు ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్ర: న్యూయార్క్​లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడి వాతావరణం ఏంటి?

జ: న్యూయార్క్​ మహానగరం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. గత వారంతో పోలిస్తే ఈ వారం పాజిటివ్​ కేసుల సంఖ్య కొంత తగ్గింది. ముఖ్యంగా జనాల రద్దీ కారణంగానే కరోనా ఉద్ధృతి పెరిగి.. నివారించడం కష్టంగా మారింది.

ప్ర: అమెరికాలో పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం ఏమిటి?

జ: ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడమే వైరస్​ ఉద్ధృతికి ప్రధాన కారణం. గత సంవత్సరం డిసెంబర్​లోనే కరోనా మొదలైనప్పటికీ.. ఫిబ్రవరి వరకూ దేశంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. మార్చి నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. కరోనా తీవ్రతను ఊహించలేకపోవడం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తోంది.

ప్ర: దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్​, బీసీజీ వ్యాక్సిన్​లు వినియోగిస్తున్నారు కదా! దాని ప్రభావం ఎలా ఉంది?

జ: హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కువ కేసులు ఉన్న చోట​ వాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా అంతగా వాడడం లేదు. నార్త్​ ఈస్ట్​లోని న్యూయార్క్​, న్యూజెర్సీ వైపు ఎక్కువగా వాడుతున్నారు. ఫలితాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. తీవ్రత ఎక్కువైనప్పుడు రోగులు, వారి కుటంబు సభ్యుల్లో మానసిక ధైర్యం నింపడం కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్​, ఎజిత్రో మైసిన్​ అనే రెండింటిని మాత్రం నార్త్​ఈస్ట్​లో వాడుతున్నారు. రికవరీ రేటు మాత్రం అంచనాకు తగినట్లుగా లేదు. అందువల్ల అన్ని చోట్ల దాన్ని అమలు చేయలేకపోతున్నారు.

ప్ర: మిగతా దేశాలతో పోల్చినప్పుడు కరోనా కట్టడి చర్యలు భారత్​లో ఎలా ఉన్నాయంటారు?

జ: కరోనా కట్టడి కోసం భారత్​లో తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలుచేయడం మంచి ఫలితాన్నిచ్చింది. దేశంలోకి కరోనా కొంత లేటుగా ప్రవేశించడం వల్ల దానిపై అవగాహన ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యలు ఫలించాయి.

ప్ర: కరోనా గుర్తింపులో దగ్గు, జ్వరం, జలుబుతో పాటు ఇంకేమైనా కొత్త లక్షణాలు వెలుగు చూశాయా?

జ:కొత్తగా కరోనా బారిన పడుతున్న వారికి వాసన, రుచి మారినట్లు అనిపించడం, వాంతులు రావడం, డయేరియా లక్షణాలు ఉండటం.. దాంతో పాటు ఛాతి బిగుతుగా ఉండటం, దగ్గినప్పుడు ఒక్కోసారి రక్తం పడటం వంటి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.

ప్ర: అమెరికాలో కరోనా వ్యాక్సిన్​ పరిశోధనలు ఎలా ఉన్నాయి. ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?

జ: వ్యాక్సిన్​ కనుగొనేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు మొదటి దశలో ఉన్నాయి. వ్యాక్సిన్​ తయారు కావడానికి సుమారు ఒక సంవత్సరం పడుతుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ ముందుగానే వచ్చినా.. సక్సెస్​ రేటు ఎంత వరకు ఉంటుందనేది చెప్పలేం.

ఇదీ చూడండి:కృష్ణా జిల్లాలో 258.. విజయవాడలోనే 218!

ABOUT THE AUTHOR

...view details