వినాయక చవితి పండగపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే వినాయక చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు.
ఆరోపణలు తగవు...
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి... వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పండితులు, మత పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు అన్ని పండగలను ఇళ్లలోనే చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని సూచించారు.