electricity charges : ప్రతిపక్ష నేత హోదా నుంచి ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన అదే జగన్... ఇప్పుడు కరెంటు ఛార్జీల్ని పెంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... అన్ని విషయాల్లో ప్రజలపై ‘బాదుడే బాదుడు’ అని ధ్వజమెత్తిన జగన్.. ఇప్పుడు అదే విద్యుత్ ఛార్జీలను బాదేసి అన్ని వర్గాల ప్రజల నడ్డివిరిచారు. అసలే ధరలన్నీ పెరిగిపోయి, కొవిడ్ సంక్షోభంతో ఆదాయాలు తగ్గి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే... అన్ని వర్గాలపైనా కరెంటు ఛార్జీల కత్తి ఝళిపించారు. గతంలో విమర్శల నేపథ్యంలో నిలిపివేసిన ట్రూ అప్ ఛార్జీలనూ తెరపైకి తెచ్చారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ అధికారికంగా చెప్పిన ప్రకారమే... కరెంటు ఛార్జీల పెంపుతో గృహ వినియోగదారులపై ప్రభుత్వం మోపిన భారం ఏడాదికి రూ.1,400 కోట్లు. శ్లాబ్‌ల కుదింపు మాయాజాలంతో ప్రజలపై పడే వాస్తవభారం మరింత ఎక్కువన్నది విద్యుత్‌రంగ నిపుణుల అంచనా.
అందరూ బాధితులే:గృహ వినియోగదారుల్లో ఏ కేటగిరీనీ వదల్లేదు. ప్రస్తుత విధానంలో వినియోగదారుల్ని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తున్నారు. ప్రతి కేటగిరీలో వేర్వేరు శ్లాబులు ఉన్నాయి. కొత్త విధానంలో... టౌన్‌షిప్‌లు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు మినహా మిగతా గృహ వినియోగదారులందరినీ ఒకే కేటగిరీగా చేశారు. ఆరు శ్లాబ్‌లే పెట్టారు. యూనిట్ ధరను కనిష్ఠంగా 45 పైసల నుంచి, గరిష్ఠంగా రూ.1.57 వరకు పెంచేశారు.
ప్రస్తుతం ‘ఎ’ కేటగిరీలో 0-50 శ్లాబ్‌కు యూనిట్ ధర రూ.1.45, 51-75 శ్లాబ్‌కు రూ.2.60గా ఉండగా... దీన్ని సరాసరి చేస్తూ 0-30 శ్లాబ్‌కు ప్రస్తుత యూనిట్ ధరను రూ.1.45గా పేర్కొంది. కానీ ప్రస్తుతం 0-30 శ్లాబే లేదు! తక్కువ శ్లాబ్‌లు పెట్టి, వినియోగదారుల్లో ఎక్కువమంది పై శ్లాబ్‌లలోకి వచ్చేలా చేసి, వారి ముక్కుపిండి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమే లక్ష్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు పాలనకు ముందు మనింట్లో కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి? 50.. 60 రూపాయలు.. బాగా అయితే 100. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? రూ.500, 700, 1000! కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయని, వస్తూనే తగ్గిస్తానన్న ఇదే పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక ఎడాపెడా... కరెంటు ఛార్జీలు 3 సార్లు పెంచారు’ - 2017 డిసెంబరులో అనంతపురం జిల్లా కదిరి బహిరంగ సభలో జగన్
విద్యుత్తు బిల్లులను ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయ్ అధ్యక్షా! చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రూ.150 వచ్చే విద్యుత్తు బిల్లు ఇప్పుడు రూ.500- రూ.600 వస్తోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పేదలు, ఎస్సీ, ఎస్టీలున్నారు.- అసెంబ్లీలో 2017 మార్చి 7న జగన్ వ్యాఖ్యలు
నాన్న (వైఎస్) హయాంలో కరెంటు రూ.3కి దొరుకుతుంటే రాష్ట్రానికి పరిశ్రమలు విచ్చలవిడిగా వచ్చాయి. ఇవాళ అదే కరెంటు రూ.8కి ఎగబాకితే ఉన్న కరెంటు బిల్లులు కట్టలేక పరిశ్రమలన్నీ పూర్తిగా మూసేస్తున్నారు.- 2018లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో జగన్