ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీజిల్‌ ఇంజిన్‌ బస్సులకు విద్యుత్‌ బ్యాటరీ.. - ఏపీఎస్​ఆర్టీసీ తాజా వార్తలు

ఆర్టీసీలోని కొన్ని బస్సులను డీజిల్‌ ఇంజిన్‌ స్థానంలో విద్యుత్‌ బ్యాటరీతో నడిచేలా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే విధంగా తిరుమల ఘాట్‌లో నడిపిన విద్యుత్‌ బస్సు విజయవంతం కావడంతో అక్కడే మరిన్ని నడపాలని భావిస్తున్నారు.

Electric battery
Electric battery

By

Published : Dec 21, 2020, 8:36 AM IST

బస్సులను డీజిల్ ఇంజిన్ స్థానంలో విద్యుత్ బ్యాటరీతో నడిచేలా మార్చేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తిరుపతి-తిరుమల ఘాట్‌, తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో విద్యుత్‌ బస్సులు నడపాలని యోచిస్తున్నారు. గతంలో కొత్త విద్యుత్‌ బస్సులు తీసుకొని నడపాలని అనుకున్నప్పటికీ, గుత్తేదారు కిలోమీటర్‌కు ఎక్కువ ధర కోట్‌ చేయడంతో ఆ ప్రతిపాదన ఆపేశారు. ఇప్పుడు పాత వాటికే ఇంజిన్‌ మార్చి విద్యుత్‌ బస్సులుగా నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు.

అనంతపురానికి చెందిన వీరా వాహన సంస్థ ప్రయోగాత్మకంగా ఆర్టీసీకి చెందిన ఒక సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ పాత బస్సును బ్యాటరీతో నడిచేలా మార్పులు చేసింది. కొద్ది రోజుల కిందట దానిని తిరుమల ఘాట్‌లో నడిపారు. అనుకున్నట్లుగానే ఛార్జింగ్‌కు సరిపడా మైలేజ్‌ వచ్చింది. దీంతో 150 బస్సులను విద్యుత్‌ బ్యాటరీతో నడిచేవిగా మార్చాలనుకుంటున్నారు. దాదాపు రెండేళ్లపాటు వీటి పనితీరును పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని సర్వీసులకు దీనిని అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.

తిరుమల ఘాట్‌లో విజయవంతంగా నడిచిన విద్యుత్‌ బస్సును ఆర్టీసీ అధికారులు పుణెలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సీఐఆర్‌టీ)కి పంపారు. ఆ సంస్థ అన్ని పరీక్షలు చేసి ఆమోదం తెలపాల్సి ఉంది. అలాగే ఇప్పుడున్న డీజిల్‌ బస్సులను విద్యుత్‌ బస్సులుగా మార్పుచేసేందుకు ఎంత వ్యయమవుతుందనే అంచనాను కూడా ఆ సంస్థ తెలియజేయనుంది. తిరుమల ఘాట్‌లో ప్రయోగాత్మకంగా నడిపిన బస్సు 3 గంటలు ఛార్జింగ్‌ పెడితే 180 కి.మీ. నడిచింది. మరో గంట అదనంగా ఛార్జింగ్‌ పెడితే మరో 100 కి.మీ.లు వచ్చినట్లు గుర్తించారు.

అలాగే కొండ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అదనంగా ఛార్జింగ్‌ అయినట్లు తేలింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌-2 పథకం కింద కొత్త విద్యుత్‌ బస్సులకు సాయం అందిస్తుండగా, ఏపీఎస్‌ఆర్టీసీకి మాత్రం ఇప్పుడప్పుడే వాటిని తీసుకునే ఆలోచన లేదని సమాచారం.

ఇదీ చదవండి:వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details