మామూలుగా కోడి గుడ్డులో తెల్లసొన, పసుపు పచ్చసొన ఉంటాయి కదా.. కానీ మీకో విషయం తెలుసా.. ఆకుపచ్చసొనతో కూడా ఉంటాయండీ బాబూ! ‘ఆ.. తెలుసులే.. అవి కుళ్లిపోయిన గుడ్లై ఉంటాయి లే’ అని తేలిగ్గా తీసిపారేస్తారేమో మీరు. కానే కాదు.. అవి చక్కని తాజా.. నాటుకోడి గుడ్లు. ‘సర్లే ఏవో విదేశాల్లో అయి ఉంటుందిలే.. ఇప్పుడు ఏంటట?’ అని మళ్లీ అంతే తేలిగ్గా అనేస్తారేమో.. అస్సలు కాదు. ఈ ఆకుపచ్చసొనతో ఉన్న కోడిగుడ్లను కేరళలోని ఒతుక్కుంగల్‌లో ఉన్న ఓ ఫాంలోని ఆరు కోళ్లు మాత్రమే పెడుతున్నాయి.
ముందు భయపడ్డారు
కేరళలోని ఒతుక్కుంగల్‌కు చెందిన షిహాబుద్దీన్ అనే అతనికి చిన్న పౌల్ట్రీఫాం ఉంది. అందులో ఆయన నాటు కోళ్లను పెంచుతుంటారు. ఓ ఆరు కోళ్లు పెట్టిన గుడ్లలో లోపలి సొన మాత్రం ఆకుపచ్చగా ఉంటోంది. మొదటగా షిహాబుద్దీన్, ఈయన కుటుంబం వాళ్లు ఆ గుడ్లు పాడైపోయాయనుకున్నారు. వాటిని తింటే ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అని భయపడ్డారు. కానీ తర్వాత వాటిని పొదిగిస్తే చక్కగా.. ఆరోగ్యవంతమైన కోడిపిల్లలు బయటకు వచ్చాయి. అప్పుడు ధైర్యం వచ్చి ఆ కోడిగుడ్లను వాళ్లు తిన్నారు. రుచి బాగానే ఉంది.