ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

EAPCET: ఈఏపీసెట్‌ వెబ్‌ ఐచ్ఛికాలకు నిరీక్షణ

EAPCET: ఈఏపీసెట్‌ వెబ్‌ ఐచ్ఛికాలకు నిరీక్షణ తప్పడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో మొదటి నుంచి జాప్యం జరుగుతోన్న విషయం తెలిసిందే.

EAPCET
ఈఏపీసెట్‌

By

Published : Sep 14, 2022, 9:39 AM IST

EAPCET: ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు మంగళవారం రాత్రి వరకు విద్యార్థులు నిరీక్షించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సులు, కళాశాలల ఎంపికకు మంగళవారం నుంచి వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులు ఉదయం నుంచి ప్రయత్నించినా సాఫ్ట్‌వేర్‌ పని చేయలేదు. సాంకేతిక సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు తెలిపారు. ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో జేఎన్‌టీయూ, కాకినాడ తీవ్ర జాప్యం చేసింది. అనుబంధ గుర్తింపు ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే అనుమతులు ఇస్తామని ప్రకటించింది. బకాయిల్లో కనీసం 25శాతం చెల్లించాలనే నిబంధన విధించింది. కొన్ని యాజమాన్యాలు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కొంత సమయం ఇస్తూ 25శాతం బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అలా ముందుకొచ్చిన కళాశాలలకు చివరి క్షణంలో వర్సిటీ అనుమతులు ఇచ్చింది. వీటిని కౌన్సెలింగ్‌లో పెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ అనుమతికి పంపగా.. సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం లోపు కళాశాలల వివరాలను కౌన్సెలింగ్‌ జాబితాలో నమోదు చేయలేక అధికారులు వెబ్‌ ఐచ్ఛికాలను నిలిపివేశారు. ఈ విషయంపై వెబ్‌సైట్‌లో ఎలాంటి నోట్‌ పెట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో మొదటి నుంచి జాప్యం జరుగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు 17వరకు గడువు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details