ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల బకాయిలు చెల్లించడానికి మరో ఎనిమిది వారాల గడువు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సమయం పొడిగించడానికి నిరాకరించింది. ప్రభుత్వానికి తగినంత సమయం గతంలోనే ఇచ్చామని గుర్తుచేసింది. వాస్తవానికి ఈ వ్యాజ్యాల్లో ఏజీ అభ్యర్థన మేరకు జులై 22 నుంచి వాయిదా వేస్తూ వచ్చామని తెలిపింది. పిటిషనర్లు సమర్పించిన బిల్లులను రెండు వారాల్లో చెల్లించాలని ఆగస్టు 23న ఉత్తర్వులిచ్చామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులు ఈ నెల 6లోపు కోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా మరో ఎనిమిది వారాలు గడువు కోరడం సమర్థనీయంగా లేదని ఆక్షేపించింది. గడువు పొడిగించడానికి సహేతుకమైన కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ నెల 9న ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
‘ఉపాధి’ బకాయిల చెల్లింపునకు గడువు పొడిగించలేం: హైకోర్టు
ఉపాది బకాయిలు చెల్లింపునకు గడువు పొడిగించలేమని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరో ఎనిమిది వారాల గడువు పొడిగించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు(మెటీరియల్ కాంపొనెంట్) రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 500 వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్లందరికీ బిల్లులు చెల్లించాలని ఆగస్టు 23న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే చెల్లింపునకు చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్‌శాఖ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. మరో ఎనిమిది వారాల సమయం కోరింది. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో రైతన్న సగటు రుణం 2,45,554