ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS Electricity charges hike: తెలంగాణలో విద్యుత్​ ఛార్జీలు పెంపు! - విద్యుత్​ ఛార్జీల పెంపునకు డిస్కంల విజ్ఞప్తి

Electricity charges hike: తెలంగాణలో త్వరలోనే విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఛార్జీల పెంపుపై ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ ప్రాతిపదికన డిస్కమ్‌లు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

TS Electricity charges hike
TS Electricity charges hike

By

Published : Dec 28, 2021, 9:41 AM IST

Electricity charges hike : తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్‌కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు చేయాలనే పెంపు ప్రతిపాదనలను సోమవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌ శ్రీరంగారావుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు రఘుమారెడ్డి, ఎ.గోపాలరావులు అందజేశారు. అనంతరం వారిద్దరూ మీడియా సమావేశంలో ప్రతిపాదనల వివరాలు వెల్లడించారు. నెలకు 200 యూనిట్లు వాడే ఇళ్లకు అదనంగా నెలకు రూ.100 వరకూ భారం పడనుంది. అంతకుమించి వాడేవారిపై భారం మరింత ఎక్కువ ఉంటుంది. రాష్ట్రంలో 1.10 కోట్ల గృహ కనెక్షన్లలో అందరికీ ఒకేస్థాయిలో యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంపు ప్రతిపాదించినట్లు సీఎండీలు వివరించారు.

విద్యుత్‌ చట్టం ఏం చెబుతోందంటే

విద్యుత్‌ చట్టం ప్రకారం కరెంటు ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ పాత్ర నేరుగా ఉండదు. ఆదాయ, వ్యయాల లెక్కలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022-23)కి ‘వార్షిక ఆదాయ అవసరాల’(ఏఆర్‌ఆర్‌) నివేదికతో పాటు, ఛార్జీల సవరణ ప్రతిపాదనలను నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్‌సీకి ఇవ్వాలని విద్యుత్‌ చట్టం చెబుతోంది. ఈ నివేదికలను ప్రజల ముందు పెట్టి బహిరంగ విచారణ జరిపి ఛార్జీలు పెంచాలా వద్దా.. పెంచితే ఎంత అనేది ఈఆర్‌సీ నిర్ణయించి మార్చి 31లోగా తుది తీర్పు చెబుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

ఈఆర్‌సీ ఆమోదం లాంఛనప్రాయమే

గతంలో ప్రభుత్వం ఛార్జీలు పెంచవద్దని అంతర్గతంగా నిర్ణయించడంతో గత అయిదేళ్లుగా డిస్కంలు ఛార్జీల సవరణ ప్రతిపాదనలే ఈఆర్‌సీకివ్వలేదు. ఇక ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈసారి ప్రతిపాదనలిచ్చాయి. ఇక ఈఆర్‌సీ ఆమోదం లాంఛనప్రాయమే.

ఏ బిల్లు.. ఏ విభాగం

* ఒక నెల కరెంటు బిల్లులో ఎన్ని యూనిట్ల కరెంటు వినియోగించారనే దానిని బట్టి సదరు కనెక్షన్‌ ఏ విభాగంలోకి వస్తుందనేది కంప్యూటర్‌ నిర్ణయించి బిల్లు వేస్తుంది.

* ఒక ఇంటిలో నవంబరులో 200 యూనిట్లు వాడితే ఆ బిల్లు ఎల్‌టీ-1(బి1) విభాగం 101 నుంచి 200లోపు వాడిన విభాగం కిందకు వస్తుంది. అంటే 1 నుంచి 100 వరకూ యూనిట్‌కు ప్రస్తుతం రూ.3.30, తరవాత 101 నుంచి 200 యూనిట్లకు రూ.4.30 చొప్పున ఛార్జీ పడుతుంది.

* అదే ఇల్లు ఒకవేళ 201 యూనిట్లు వాడితే ఎల్‌టీ-1(బి2) విభాగంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నేరుగా 1 నుంచి 200 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.5 చొప్పున ఛార్జీ పడుతుంది. అన్ని విభాగాల్లో ప్రతి యూనిట్‌కూ నేరుగా 50 పైసలు అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.

అయిదేళ్లుగా ఛార్జీలు పెంచలేదు

గత అయిదేళ్లుగా రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచలేదని సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి తెలిపారు. కరోనా విపత్తు డిస్కంలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పలు రకాలుగా ఆర్థికభారం పడింది. గ్రీన్‌ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై రూ.50 ఉంటే కేంద్రం రూ.400కి పెంచింది. బొగ్గు ధర టన్నుకు అదనంగా రూ.800 పెంచారు. రైల్వే రవాణా ఛార్జీలు గత నాలుగేళ్లలో 40 శాతం అదనంగా పెరిగాయి. ఉద్యోగులకు రెండుసార్లు వేతన సవరణ, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు.. భారం డిస్కంలపై పడింది’ అని వివరించారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థ మెరుగుకు డిస్కంలు గత ఏడేళ్లలో రూ.34,087 కోట్లు ఖర్చు పెట్టాయని వివరించారు.

మరిన్ని ముఖ్యాంశాలు

* ప్రజల తలసరి కరెంటు వినియోగం 2020-21లో సగటున 2071 యూనిట్లుంది. జాతీయ సగటు 1161 యూనిట్లతో పోలిస్తే ఇది ఎక్కువ.

* రోజువారీ విద్యుత్‌ గరిష్ఠ డిమాండు రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా గత మార్చి 26న 13,688 మెగావాట్లుగా నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు 2014 మార్చి 23న ఉమ్మడి ఏపీ రాష్ట్ర రోజువారీ గరిష్ఠ డిమాండు 13,162 మెగావాట్లు. ఇప్పుడు తెలంగాణ ఒక్కటే అంతకన్నా ఎక్కువగా ఉంది.

వీరికి ప్రభుత్వ రాయితీలు

వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101, క్షౌరశాలలకు 250 యూనిట్ల వరకూ పూర్తి ఉచితంగా కరెంటు సరఫరా కొనసాగుతుంది. పవర్‌లూమ్‌లు, కోళ్లఫారాలు, స్పిన్నింగ్‌ మిల్లులకు యూనిట్‌ ఛార్జీలో రూ.2 రాయితీ ప్రభుత్వం భరిస్తుంది.

ఇంత పెంచినా లోటే..
ప్రస్తుతం వసూలు చేస్తున్న కరెంటు ఛార్జీలు, ప్రభుత్వ రాయితీ కలిపి ఏడాదికి రూ.42,126 కోట్ల ఆదాయం వస్తుంది. వ్యయం రూ.53,054 కోట్లు. వీటి అంతరం రూ.10,928 కోట్లు. ఛార్జీల పెంపు ద్వారా రూ.6831 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. అయినప్పటికీ డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య లోటు వచ్చే ఏడాది(2022-23) రూ.4097 కోట్లు. దాన్ని అంతర్గత వనరులు, ప్రభుత్వం నుంచి మరింత సాయం అడగటం ద్వారా పూడ్చుకోవాలని యోచిస్తున్నాం. -సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి

ఆన్‌లైన్‌లో ప్రతిపాదనల వివరాలు
డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో పెట్టి వచ్చే సూచనలను ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి వచ్చే మార్చి 31లోగా తుది తీర్పు ఇస్తాం. డిస్కం ఆదాయ, వ్యయాలపై ఇచ్చిన అంచనాలు, ఛార్జీల పెంపు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించిన తరవాత ఛార్జీలు ఎంత పెంచాలనేది ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఈఆర్‌సీ ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తే అవి అమల్లోకి వస్తాయి. లేకపోతే ఎంత పెంచాలని నిర్ణయిస్తే అంతగా అవి అమలవుతాయి. -ఈఆర్‌సీ ఛైర్మన్‌ రంగారావు

ప్రస్తుత ఛార్జీల ప్రకారం...

ఒక ఇంటిలో నెలకు 201 యూనిట్ల కరెంటు వాడారనుకుందాం. బిల్లు 200 యూనిట్లు దాటినందున ఎల్‌టీ-1(బి2) విభాగంలోకి వస్తుంది. మొదటి 200 యూనిట్లకు రూ.5 చొప్పున రూ.1000, మిగిలిన యూనిట్‌కు రూ.7.20 కలిపి మొత్తం 201 యూనిట్లకు రూ.1007.20 బిల్లు, ఇంధన రుసుంతో కలిపి రూ.1100 వరకూ బిల్లు వస్తుంది.

ప్రతిపాదిత ఛార్జీల ప్రకారం...

మొదటి 200 యూనిట్లకు రూ.5.50 చొప్పున రూ.1,100, మిగిలిన యూనిట్‌కు రూ.7.70 కలిపి మొత్తం 201 యూనిట్లకు కలిపి 1107.70 ఛార్జి, ఇంధన రుసుంతో రూ.1200 వస్తుంది. అంటే 201 యూనిట్ల కరెంటు వాడే ఇంటికి నేరుగా రూ.100 అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.

ఇదీ చూడండి: New Decision: ఇక ఎవరి దస్తావేజు వారే రాసుకోవచ్చు..!

ABOUT THE AUTHOR

...view details