తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారు తిప్పాపూరు.. వేములవాడకు నాలుగేళ్ల కిందట 800 ఇళ్లు మంజూరైతే, 144 ఇళ్ల నిర్మాణం తిప్పాపూరులో చేపట్టారు. చవుడు నేల కావడంతో చిన్నపాటి వానకే నీళ్లు ఊరుతూ పైకి వస్తున్నాయి. దీంతో ఏడాదిన్నరగా ఇక్కడ పిల్లర్లు, శ్లాబుల దశలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మిగిలిన 656 ఇళ్లకు ఇంకా స్థలాల కోసం వెతుకుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండుపడక గదుల ఇళ్ల(Double Bedroom Scheme) పథకం పనులు గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పాటు నిధుల కొరతతో తీవ్ర ఆలస్యమవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్నచోట మాత్రం వేగంగా సాగుతున్నాయి.1.80 లక్షల ఇళ్ల వరకు నిర్మాణం పూర్తయ్యిందని గృహనిర్మాణశాఖ చెబుతున్నా, వాటిలో లబ్ధిదారులకు అప్పగించినవి పదో వంతు లోపే. జిల్లా కేంద్రం భూపాలపల్లిలో ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లయ్యింది. విద్యుత్తు, ఫంక్షన్‌హాల్ ఇలా అన్ని సౌకర్యాలు కల్పించారు. రెండువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. కొన్ని ఇళ్ల తాళాలను దొంగలు పగలగొట్టారు. మరికొన్ని ఇళ్లలో విద్యుత్తు తీగలు కోసుకెళ్లారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి 30 ఇళ్లు మంజూరైతే.. బిల్లులు రాక, నీటి సౌకర్యం లేక పునాదిదశలో ఆగాయి. మొరవానిగూడెం, ఉప్పెడు, ఆలుబాకకు 30 ఇళ్ల చొప్పున మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాక పనులు మొదలుకాలేదు.
రెండేళ్ల క్రితమే పూర్తయినా..
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారంలో 70 ఇళ్లు మంజూరైతే 18 ఇళ్ల(Double Bedroom Scheme) నిర్మాణం రెండేళ్ల కిందటే పూర్తయ్యింది. దారి లేదన్న కారణంతో 52 ఇళ్ల పనుల్ని గుత్తేదారులు ఏడాదిన్నర క్రితం నిలిపివేశారు. పూర్తయినవాటినీ లబ్ధిదారులకు కేటాయించలేదు. ఆ ఇళ్ల చుట్టూ పొదలు కమ్మేశాయి. కిటికీల అద్దాలు పగిలాయి.
నాలుగేళ్లకు పనులు.. రెండేళ్లుగా పునాది దశలోనే
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి ఆరేళ్ల కిందట 54 ఇళ్లు(Double Bedroom Scheme) మంజూరయ్యాయి. నాలుగేళ్ల ఆలస్యంగా మొదలైన పనులు పునాది దశలోనే ఆగిపోయాయి. కొడకంచిలో 50 ఇళ్లు మంజూరైతే రెండేళ్ల క్రితం నిర్మాణం మొదలైంది. శ్లాబ్ దశలో ఆగిపోయాయి.
అయిదేళ్లుగా ఆగిపోయి..
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేదరమెట్ల గ్రామానికి 50, ములకలపల్లికి 51, వేములపల్లికి 61.. మొత్తం 162 ఇళ్లు అయిదేళ్ల కిందట మంజూరయ్యాయి. పిల్లర్లు, శ్లాబు దశలోనే పనులు ఆగిపోయాయి. దీంతో చుట్టూ పిచ్చి చెట్లు పెరుగుతున్నాయి.
- నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 285 కుటుంబాలు సొంతింటి కోసం ఎదురుచూస్తుంటే, మూడేళ్ల కిందట 30 ఇళ్లు మంజూరయ్యాయి. గత ఏడాది నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇళ్ల కిటికీలు, తలుపులు ఊడిపోతున్నాయి.
- మహబూబ్‌నగర్ శివారు దివిటిపల్లిలో 1024 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. జులైలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ వచ్చి 100 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మిగిలినవారికి త్వరలో ఇస్తామని చెప్పారు.
- నాగర్‌కర్నూల్ జిల్లాకు 5,200 ఇళ్లు, నారాయణపేట జిల్లాకు 520 ఇళ్లు మంజూరైతే.. ఈ రెండుచోట్ల ఒక్క ఇంటి నిర్మాణమూ పూర్తికాలేదు. నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాలకు కలిపి 2,800 ఇళ్లు మంజూరు చేసినా ఒక్కటీ మొదలుపెట్టలేదు.
నగదు సాయం కోసం ఎదురుచూపులు