అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం ఆశ్వ యుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు9రోజులు దేవీ నవరాత్రులు...పదవ రోజు విజయ దశమి కలసి దసరాగా పిలుస్తారు.శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కావటంతో...నవరాత్రిని శరన్నవరాత్రి అని కూడా అంటూ ఉంటారు.ఈ అన్ని రోజులు పూజలు పునస్కారాలతో పాటు ఆటపాట,బొమ్మలకొలువులు,ఆలయాల్లో అమ్మవారికి అలంకరణలు...ఇలా ఎన్నో ప్రత్యేకతలు.నేపథ్యాలు,కథలు,ఎలా ఉన్నప్పటికీ అన్నిచోట్ల సాధారణంగా కనిపించే అంశం మాత్రం శక్తి ఆరాధనే.
దుర్గ..కాళీమాత..భద్రకాళీ..పేర్లు ఏవైనా..దశమి పూజలు మొత్తం శక్తిస్వరూపిణికే.అమ్మ లు గన్న అమ్మ దుర్గమ్మను శక్తికి ప్రతీకగా భావిస్తారు. మహాలక్ష్మిగా,అన్నపూర్ణగా,గాయత్రిగా,బాలాత్రిపురసుందరిగా,రాజరాజేశ్వరిగా,మహిషాసుర మర్ధినిగా...ఇలా ఎన్నివిధాలుగా ఆరాధించినా అన్నీ చేరేవి అమ్మవారికే.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశమంతా చేసుకునే దసరా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఇంటింటా పెద్ద పండగే.అంబరాన్ని అంటే సంబరాలే అందుకు నిదర్శనం.ఈ దసరా నవరాత్రుల్లో చేసే ప్రతి క్రతువుకూ ఓ పరమార్థం ఉందనే చెబుతారు పెద్దలు.ప్రతి పూజలో ఒక విశిష్టత ఉందని అంటారు.
ప్రధానంగా దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుడుని వధిస్తే లోహం పుట్టిందని,అందుకే దసరా రోజుల్లో లోహ పరికరాలు పూజించే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు.ఇక దుర్గ అన్న పేరుకే ఎంతో ప్రత్యేకత ఉందని అంటారు పండితులు.దుర్గమైనది దుర్గ.దుర్గతులు తొలగించేది దుర్గ.ఈమె దుర్గేయురాలు కనుక..దుర్గ అయింది.
దుర్గలోని'దుర్'అంటే దుఃఖం,దుర్భిక్షం,దుర్వ్యసనం,దారిద్ర్యం మొదలైనవి. 'గ'అంటే నశింపచేసేది అని అర్థం.ఈ తల్లి ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత,ప్రేత,పిశాచ,రక్కసుల బాధలు దరి చేరవని నమ్మకం.ఇక నవరాత్రుల పూజల విషయానికి వస్తే...మొదటి3రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలు,తర్వాత3రోజులు లక్ష్మీరూపం ఆరాధించి సిరి సంపదలు,చివరి3రోజులు సరస్వతి రూపం ఆరాధించి జ్ఞానం పొందొచ్చని పెద్దలు చెప్తుంటారు.
శరద్ రుతువు ఆరంభంతో మొదలయ్యే శరన్నవరాత్రులతో వాడవాడలా కొలువుతీరిన ఆ అపరకాళికి పూజలు నిర్వహించి..భక్త జనం ఉప్పొంగి పోయారు.ఆయుధ పూజలు నిర్వహించడం ద్వారా..చేస్తున్న పనిని దైవంగా భావించే భారతీయ తత్త్వాన్ని ప్రంపంచానికి మరోసారి చాటారు.
కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ.ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు.పదవరోజు పార్వేట ఉంటుంది.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది.తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు.ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు.తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ.విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.ఈ సందర్భమున రావణ వధ,జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు.జగన్మాత అయిన దుర్గా దేవి,మహిషాసురుడనే రాక్షసునితో9రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు,అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.