తెలంగాణలోని హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్, కందుకూరు, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహిళలను వేధిస్తున్న డాన్స్ మాస్టర్ అరెస్ట్ - హైదరాబాద్ క్రైం వార్తలు
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆకతాయిల అల్లర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎందరో మహిళలు వారి ఆగడాలకు బలవుతున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే మరో ఆకతాయి డాన్స్ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితునిపై తెలంగాణలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయని... దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
మంచాల మండలం అరుట్ల గ్రామానికి చెందిన మహమ్మద్ అస్లాం ఓ ఇంజినీరింగ్ కళాశాలలో డాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కళాశాలలోని మహిళ ఫ్యాకల్టీ అశ్లీల ఫోటోలు ఉన్నాయని బెదిరించి... రూ.2 లక్షలు ఇవ్వాలని అస్లాం డిమాండ్ చేసినట్లు డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
మహిళలకు రాచకొండ పోలీసుల విజ్ఞప్తి...
మహిళలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యoగా ఉంచుతామని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.