భాగ్యనగరాన్ని మళ్లీ వర్షం (HEAVY RAINS IN HYDERABAD) బెంబేలెత్తించింది. లోతట్టు ప్రాంతాల్లో వరద దృష్ట్యా.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇవాళ సెలవు ప్రకటించింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రాజేంద్రనగర్ నియోజవర్గంలోని గగన్‌పహాడ్ వద్ద.. బెంగళూరు జాతీయ రహదారిపై.. అప్పా చెరువు వరద పోటెత్తింది. శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను.. ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఒక వైపుగానే వాహన రాకపోకలు సాగుతున్నాయి. విమానాశ్రయానికి వెళ్లాల్సిన వారు.. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. గగన్‌పహాడ్ వద్ద అప్పా చెరువును.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పరిశీలించారు. చెరువు కట్టపై కలియ తిరుగుతూ... లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. చెరువు కట్టను ఆనుకుని ఉన్న పరిశ్రమ యజమానులతో చర్చించి.. తరలించే నిర్ణయం తీసుకుంటామని ఎంపీ తెలిపారు.
జలదిగ్బంధంలో పలు కాలనీలు..
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారం (GULAB CYCLONE EFFECT) పరిధిలోని.. ఓక్షిత్ ఎంక్లేవ్ కాలనీలోకి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతమైన ఈ కాలనీలోకి.. ఎగువ ప్రాంతంలోని చెరువు నీరు వచ్చి చేరుతోంది. దీంతో కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని కాలనీవాసులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్.. మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్.. వరద నీటిలోని ప్రాంతాలను పరిశీలించారు. గల్లీలన్నీ తిరిగి సమస్యను పరిష్కరించాలని.. అధికారులను డిమాండ్ చేశారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (HEAVY RAINS IN MEDCHAL) మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ప్రధాన రహదారిపై మోకాలు లోతు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 13 ఏళ్లుగా అవస్థలు పడుతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదుచేసినా.. సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.
ఆయా కాలనీల్లో అవస్థలు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, ఘట్‌కేసర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందడటంతో అక్కడకు సమీపంలో రోజుకో కొత్త కాలనీ ఏర్పాటవుతోంది. అక్కడ కాలనీల్లో కనీస వసతులు లేక.. వర్షాకాలం వచ్చిందంటే వారికి అవస్థలు ప్రారంభమవుతున్నాయి. మూసీ కాలువలను ఆనుకొని లేఅవుట్ల తయారు చేసి ఇంటి స్థలాలుగా అమ్మేశారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి వచ్చే వర్షపునీరు మూసీ కాలువ వెంట ప్రవహించకుండా కొత్తగా ఏర్పడ్డ కాలనీలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఆయా కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్..
హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో.. హిమాయత్‌సాగర్ 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మూసి నదిలోకి నీటికి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ జలాశయం 4 గేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ దిగువన ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వంతెనపై రాకపోకలను నిలిపేశారు. జలశయాల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. హిమాయత్‌సాగర్ గేట్లను ఎత్తివేయడంతో మూసీలోకి వరద నీరు వస్తోంది. ఫలితంగా అక్కడ నుంచి పూరానాపూల్ వద్ద రోడ్డుపైకి నీళ్లు రావడం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.