రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 60 ఏళ్లు.. ఆపై వయసుగల వారి వివరాలు ఆధార్ నెంబరుతో సహా వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్నాయి. ఈ వివరాలు ఎంతవరకూ ఖచ్చితంగా ఉంటాయన్నది సందేహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆధార్ సంఖ్య సాయంతో ఎవరికి వారు కొవిన్ యాప్‌లో నమోదుచేసుకునే అవకాశాన్ని కల్పిస్తారా? ఇంకేదైనా మార్గాన్ని అనుసరిస్తారా? వయసు నిర్ధారణను ఎలా పరిగణనలోనికి తీసుకుంటారన్‌న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో వీరి సంఖ్య కోటికిపైగానే ఉంటుందని చెబుతున్నారు. వీరికి టీకా ఇచ్చేందుకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పట్టవచ్చు.
24 నుంచి పోలీసులకు టీకా పంపిణీ?
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన దృష్ట్యా సుమారు 90వేల మంది పోలీసులకు ఈ నెల 24 నుంచి ‘కొవిడ్’ టీకా వేసే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు1,500 మంది రైల్వే పోలీసులకు కూడా టీకా పంపిణీ చేయనున్నారు.
25తో ముగియనున్న తొలివిడత ప్రక్రియ!
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసే వైద్య సిబ్బందిలో మొత్తం 4.13 లక్షల మంది టీకా కోసం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో 2.50 లక్షల మంది (60%) ఆదివారం వరకు టీకా వేయించుకున్నారు. ఈ నెల 25తో ఇది ముగియనుండటంతో రానున్న 3 రోజుల్లో అదనంగా మరో 10% మంది టీకా వేయించుకోవచ్చని అంచనా. రాష్ట్రంలో వైరస్ కేసులు తక్కువగా నమోదు అవుతుండడం, కొద్దికాలం వేచి ఉండాలన్న ధోరణి, అక్కడక్కడ దుష్ఫలితాలు రావడం వల్ల కొందరు టీకా వేయించుకొనేందుకు సంశయిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 78.54%
గరిష్ఠంగా శ్రీకాకుళం జిల్లాలో 78.54%, కనిష్ఠంగా కృష్ణా జిల్లాలో 50.79% మంది టీకా వేయించుకున్నారు.. మిగిలిన జిల్లాల్లో 51% నుంచి 72.13% మధ్య టీకా పంపిణీ జరిగినట్లు రికార్డుల్లో నమోదైంది. తొలివిడతలో టీకా వేయించుకున్న వారిలో ఆదివారం వరకు 88వేల మంది మలివిడత టీకా కూడా పొందారు. అయితే పంపిణీ కేంద్రాలు ఏర్పాటు, సంబంధితులకు సమాచారం పంపడంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇతర శాఖల ఉద్యోగులకు కొనసాగుతున్న పంపిణీ
ఈ నెల 3 నుంచి రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, తదితర శాఖల వారికి టీకా పంపిణీ ప్రారంభమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదివారం వరకు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలో 3.70 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆదివారం వరకు 1,11,983 మంది టీకా పొందగా ఇదే సంఖ్యలో ఇతర శాఖల ఉద్యోగులు కూడా టీకా వేయించుకోవడం గమనార్హం.
కొత్తగా 41 కరోనా కేసులు
రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 18,257 నమూనాలు పరీక్షించగా ఇందులో కొత్తగా 41 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
అంగన్‌వాడీ ఆయా మృతి
కొవిడ్ టీకా వికటించిందని కుటుంబ సభ్యుల ఆరోపణ
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా నూర్జహాన్(56) సోమవారం ఆసుపత్రిలో మృతి చెందారు. ఈమె ఈ నెల 15న కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, వాంతులు అవుతుండటంతో చికిత్స చేయించారు. కరోనా టీకా వికటించే తన తల్లి మృతి చెందిందని, వైద్యులు సరిగా చికిత్స అందించలేదని ఆమె కుమారుడు షేక్షావలి ఆరోపించారు. అంగన్‌వాడీ సిబ్బంది, సీఐటీయూ నాయకులు ఐసీడీఎస్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నా చేశారు. ఐసీడీఎస్ పీడీ భాగ్యరేఖ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కర్నూలు సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. నూర్జహాన్ సెరిబ్రల్ మలేరియా సమస్యతో మృతి చెందారన్నారు. మలేరియా కారణంగానే ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి సమస్యలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
లాక్‌డౌన్ దిశగా కర్ణాటక!
కొన్నిచోట్ల సరిహద్దుల మూసివేత
కరోనా కారణంగా కర్ణాటకలో మరోమారు లాక్‌డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లోని కేరళ, మహారాష్ట్రల్లో వైరస్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆ రాష్ట్రాల్లో అక్కడక్కడా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. కర్ణాటకలో ప్రస్తుతం రోజుకు 400కుపైగా కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సగం బెంగళూరులోనే వస్తున్నారు. రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న కేరళ విద్యార్థులు వారాంతాల్లో సొంత ఊళ్లకు వెళ్లి వస్తుండటంతో వారి నుంచి వైరస్ వ్యాపిస్తోందని ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. గతవారం బెంగళూరు, మంగళూరుల్లోని నర్సింగ్ కళాశాలల్లో 80 మంది కేరళ విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఆ కళాశాలలను కంటెయిన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. వయనాడ్, కాసరగోడులతో పాటు 13 సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుజరాత్, దిల్లీ, గోవా, రాజస్థాన్‌ల నుంచి వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నివేదిక తప్పనిసరి చేశారు. ఇకపై వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్య 500కు మించకూడదని నిబంధన విధించారు. ఐదు కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్ని కంటెయిన్‌మెంట్ జోన్లుగా పరిగణిస్తామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యలపై అధికారులు, విషయ నిపుణులతో కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ సోమవారం విధానసౌధలో కీలక సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి:అవరోధాలు తొలగితే పరిషత్ ఎన్నికలు : ఎస్ఈసీ