రాష్ట్రంలో కొవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న చాలా ప్రైవేటు ఆసుపత్రులు వ్యాధి నిర్ధారణకు సీటీ స్కాన్‌పైనే ఆధారపడుతున్నాయి. అందులో కనిపించిన లక్షణాల్ని బట్టి... నేరుగా కరోనాకు చికిత్స చేస్తున్నాయి. ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్ వంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సదుపాయాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో లేకపోవడంతో నేరుగా సీటీ స్కాన్‌తోనే కొవిడ్‌ను నిర్ధారిస్తున్నాయి. కరోనా లక్షణాలతోనే కాదు ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన వారికీ చికిత్స చేయాలంటే ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్ వంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సదుపాయం, ల్యాబ్‌లు ప్రైవేటు ఆసుపత్రుల్లో లేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నమూనా సేకరణ కేంద్రాలకు పంపించి పరీక్షలు చేయిద్దామనుకుంటే.. ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. అప్పటివరకు చికిత్స చేయకుండా రోగిని ఆసుపత్రిలో ఉంచుకోవడం ఆ వ్యక్తికే కాక మిగతా వారికీ ప్రమాదమే. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు వెంటనే తేల్చే సీటీ స్కాన్‌వైపు మొగ్గుచూపుతున్నాయి.
* అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులు సీటీ స్కాన్ ద్వారా ఒక వ్యక్తి ఊపిరితిత్తుల్ని పరిశీలించి అతనికి కరోనా సోకిందీ లేనిదీ నిర్ధారించగలరని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎంతుందో చెప్పవచ్చని పేర్కొంటున్నారు. దీనివల్ల వెంటనే చికిత్స ప్రారంభించవచ్చని అంటున్నారు.
* ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్ వచ్చినా సీటీ స్కాన్‌లో నెగెటివ్ వస్తే కంగారుపడక్కర్లేదు. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నట్టు తేలితే ఇంట్లో ఉండే చికిత్స పొందవచ్చు.
* ఇదివరకు సీటీ స్కాన్ చేసిన వారిలో 5-6 శాతం మందిలోనే ఊపిరితిత్తుల్లో సమస్యలు కనిపించేవి.