తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 50 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. ఇప్పటివరకు తెలంగాణలో మహమ్మారి బారిన పడి 18 మంది మృతి చెందారు. 496 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురు మాత్రమే ఐసీయూలో ఆక్సిజన్ పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 128 మంది నమూనాలు పరీక్షిస్తే.. వారిలో రెండుసార్లు నెగిటివ్ వచ్చిన 68 మందిని గురువారం డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా కరోనా కోరల్లోంచి బయటపడిన వారి సంఖ్య 186కు చేరింది.
తెలంగాణలో అతివేగంగా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన 700 కేసుల్లో 106 కేసులు 11 కుటుంబాల్లోనే నమోదయ్యాయి. అన్నీ మర్కజ్ నుంచి వెళ్లివచ్చిన కుటుంబాలే కాగా.. ఒక్కరి ద్వారానే 20, 15, 14 మంది చొప్పున కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. వీరిలో 6 నెలల పసికందు నుంచి పదేళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేల పరీక్షలు నిర్వహించగా.. వీటిలో 645 కేసులు మర్కజ్ ప్రయాణికులేనని వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది.
అమ్మనాన్నలున్న ఆస్పత్రిలోనే పిల్లలు:
అమ్మానాన్నలతో పాటు... తాత, అవ్వ, చిన్నాన్న, చిన్నమ్మ ఇలా కుటుంబాల్లో అత్యధికులు కరోనా బారినపడుతుండడం వల్ల వారిళ్లలో వైరస్ సోకని చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించింది. ఇలాంటి చిన్నారుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయమ్మలను నియమించి, పిల్లల సంరక్షణ బాధ్యతలకు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ముందుగా కోలుకొని బయటకు వస్తే వారికి పిల్లలను అప్పగిస్తారు.