ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి... మళ్లీ విజృంభణ - Telangana corona virus latest news

తెలంగాణలోని గ్రేటర్‌ హైదరాబాద్​లో గురువారం ఒక్క రోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. 22 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఒకటి రెండు నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా పెరగడం వల్ల యంత్రాంగం అప్రమత్తమైంది. జియాగూడ, వనస్థలిపురం, హబ్సిగూడలో కొవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరంతా అప్పటికే షుగర్‌, అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిపింది.

corona-positive-cases-increases-at-hyderabad
తగ్గినట్టే తగ్గి... మళ్లీ విజృంభణ

By

Published : May 1, 2020, 3:07 PM IST

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి... మళ్లీ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే నగరంలో 22 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​-19 వైరస్‌తో జియాగూడలో వెంకటేశ్వరనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ(48) మృతి చెందారు. పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పలు ఆస్పత్రులు తిరిగి చివరికి బుధవారం గాంధీ ఆసుపత్రికి చేరారు. అక్కడ వైద్యులు కరోనా పాజిటివ్‌గా తేల్చారు. అప్పటికే విషమించడం వల్ల గురువారం తెల్లారి మృతి చెందింది. గృహిణికి వైరస్‌ ఎలా సోకిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

గర్భిణులకు స్వీయ నిర్బంధం...

ఈస్ట్‌ మారేడుపల్లి సమీప బస్తీలో 11మంది గర్భిణులు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరు ఇటీవల వైద్య పరీక్షలకని 102 వాహనంలో వెళ్లారు. ఆ వాహన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని క్వారంటైన్‌ చేశారు.

* కరోనాతో మృతి చెందిన హబ్సిగూడ డివిజన్‌ పీఎస్‌ కాలనీకి చెందిన వ్యక్తి మలక్‌పేటలోని గంజి మార్కెట్లో వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం హృద్రోగంతో వైద్యశాలకు వెళ్లి మృతి చెందాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు ‘కరోనా పాజిటివ్‌’గా తేల్చారు. దీంతో మలక్‌పేట మార్కెట్‌ను మూసివేశారు.

* రంగారెడ్డి జిల్లా పొద్దటూర్‌ గ్రామానికి చెందిన బాలిక(6)కు కరోనా సోకింది. బాలిక అమ్మ మూడు రోజుల కిందట కరోనాతో మృతి చెందింది.

* వనస్థలిపురానికి చెందిన వృద్ధుడి(74)ని గాంధీకి తరలించి పరీక్షలు చేయగా కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి ద్వారా సోకినట్లు గుర్తించారు.

* కాప్రా సర్కిల్లో మరో అయిదుగురు కొవిడ్‌ బారిన పడ్డారు. వీఎన్‌రెడ్డికాలనీలో ఓ వ్యాపారి(63)కి వైరస్‌ సోకగా వైద్యులు అతని కుటుంబ సభ్యులను పరీక్షించారు. వీరిలో అయిదుగురికి పాజిటివ్‌గా తేలింది. అయితే.. వీరెవరికీ కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. సర్కిల్‌ పరిధిలో కేసులు 12కు చేరినట్లు ఉప కమిషనర్‌ శైలజ వెల్లడించారు.

* జల్‌పల్లి ఎర్రకుంట షరీఫ్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా నిర్ధారణ అయింది.

ABOUT THE AUTHOR

...view details