కరోనా పేరు వింటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. ఇక బాధితులనైతే చాలామంది వెలివేసినంత పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, రక్తం పంచుకుని పుట్టిన వారూ బాధితులను రోడ్డున పడేస్తున్నారు. కొవిడ్ సోకుతుందనే భయంతో.. బాధితులు చనిపోతున్నా దగ్గరకు కూడా రాని ఘటనలు, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న దాఖలాలు అనేకం. ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేక..కొందరు కరోనా సోకిందని తెలియగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కరోనా వ్యాధి పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. మిగతా వైరస్‌లతో పోలిస్తే దీని వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ... దీని వల్ల మరణాలు సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని వివరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి పట్ల వివక్ష చూపవద్దని... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.