ప్రపంచమంతా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంటే... ఆ యుద్ధాన్ని, వైరస్ తీవ్రతను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న సాధనం కెమెరా. కానీ... ఆ కెమెరాను కూడా కరోనా వైరస్ కాలసర్పమై మింగేస్తోంది. ఫొటోగ్రఫీ రంగంపై ఆధారపడిన కుటుంబాలను అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ఈ రంగంపై పెనుప్రభావం చూపుతోంది.
స్టూడియోలు మూసివేత
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే సమూహాలుగా ఉండవద్దని, పెళ్లిళ్లు, వేడుకలను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ప్రజలంతా ప్రాణభయంతో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది నిరాడంబరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లల్లోనే శుభకార్యాలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఫంక్షన్ హాల్స్ మూతపడ్డాయి. దీనివల్ల ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా పోయింది. ఈ కారణంగా వారికి వచ్చే ఆదాయాన్ని నష్టపోతున్నారు.