ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలలో కరోనా మహమ్మారి.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్​...

విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటివరకు 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజన సిబ్బందికి, బోధనేతర సిబ్బందికీ కరోనా సోకడంతో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు కొవిడ్‌ కాటుకు బలయ్యారు

corona effect on schools in ap
పాఠశాలకూ పాకిన మహమ్మారి

By

Published : Nov 6, 2020, 6:44 AM IST

Updated : Nov 6, 2020, 11:11 AM IST

పాఠశాలల పునఃప్రారంభంతో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి సెప్టెంబర్‌ 22 నుంచి 9,10 తరగతుల విద్యార్థులను తల్లిదండ్రుల సమ్మతితో బడులకు అనుమతిస్తున్నారు. అప్పటి నుంచి పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. రాకపోకలు సాగించడం దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. ఈ నెల 2 నుంచి పూర్తిస్థాయిలో 9, 10 తరగతులు ప్రారంభమయ్యాక ఉపాధ్యాయులు కరోనా పరీక్షలు చేయించుకుని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే మిగతా వారు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 1.89 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక వీరందరూ బడులకు వెళ్లేందుకు రోజూ ప్రయాణాలు సాగిస్తున్నారు. దీని వల్ల కరోనా బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి. సరైన జాగ్రత్తలు పాటించకపోతే కొవిడ్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 70 వేల 90 మంది ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 829 మందికి పాజిటివ్‌గా తేలింది. 95,763 మంది విద్యార్థులకు గానూ 575 మంది కరోనా బారినపడ్డారు. విద్యార్థుల నుంచి కుటుంబ సభ్యులకూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పాఠశాలలో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు గుమిగూడటం వల్ల ఆయా ఊ‍ళ్లల్లోనూ కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.

గణాంకాల్లో వ్యత్యాసం..

రాష్ట్రస్థాయిలో అధికారులు విడుదల చేస్తున్న గణాంకాలు, క్షేత్రస్థాయి అధికారుల లెక్కల్లో వ్యత్యాసం ఉంటోంది. కొన్ని చోట్ల రాష్ట్ర గణాంకాల కన్నా జిల్లా లెక్కల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మధ్యాహ్న భోజనం సిబ్బందికి కరోనా సోకింది. భోజనం సమయంలో పిల్లలు మాస్కులు తీసేస్తారు కాబట్టి ఎక్కువ మందికి వ్యాధి విస్తరించే అవకాశాలున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులోని నందవరం మోడల్‌ పాఠశాలలో కాపలాదారుకు పాజిటివ్‌గా తేలింది. ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులు, నలుగురు విద్యార్థులకు కరోనా సోకిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ పేర్కొంది. జిల్లా అధికారుల గణాంకాలు మాత్రం 9 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు వైరస్‌ బారిన పడ్డారని చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 187 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో ఏడుగురు ఉపాధ్యాయులు, నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. విశాఖ జిల్లాలో నలుగురు బోధనేతర సిబ్బంది, కృష్ణా జిల్లాలో 50 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి జెడ్పీ పాఠశాలలో ఓ ఉపాధ్యాయు రాలికి కోరనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు వచ్చాక కరోనా సోకిందని తెలియడంతో ఆమెను ఇంటికి పంపించేశారు. గురువారం ఒక్క విద్యార్థి కూడా బడికి రాలేదు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కరోనాతో మృతిచెందారు.

పాఠశాలకూ పాకిన మహమ్మారి

ఇదీ చదవండి:

మచిలీపట్నం పోర్టు డీపీఆర్​కు కేబినెట్ ఆమోదం

Last Updated : Nov 6, 2020, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details