రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గేసరికి చాలామందిలో భయం పోయింది. అసలు కరోనా లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ అజాగ్రత్తే మరోసారి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో కరోనా మళ్లీ జడలు విప్పింది. ఆ రాష్ట్రంతో పాటు పంజాబ్‌లోనూ ఆంక్షలు విధించారు. అక్కడే కాదు.. మనదగ్గరా మళ్లీ కేసులొస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 210 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలోని గోపాలపట్నం జడ్పీ బాలికల ఉన్నతపాఠశాలలో నలుగురు విద్యార్థినులకు కరోనా సోకింది. మన రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పరిస్థితి రాకూడదంటే ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలన్నీ గాలికి..
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడానికి ప్రజల అజాగ్రత్తే కారణమని అక్కడి వైద్యులు, అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలోనూ దానికి భిన్నమైన పరిస్థితులేమీ లేవు.
* చాలామంది అసలు మాస్కులే పెట్టుకోవడం లేదు. భౌతిక దూరం పాటించడం అన్న మాటే లేదు.
* విందులు, వినోదాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మాస్కులు లేకుండా మాట్లాడుకుంటున్నారు.
* మాల్స్, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు గతంలో మాస్క్ ఉంటేనే అనుమతిస్తామని చెప్పేవి. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.
* రోడ్డుపక్కన అల్పాహార బళ్లు కిటకిటలాడుతున్నాయి.
* రాజకీయ సమావేశాలు, ర్యాలీలు, వేలలో ప్రజలు గుమికూడటం యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఇవి తప్పనిసరి
* బయటకు వెళ్తే మాస్కు పెట్టుకోవడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
* అవసరమైతేనే బయటకు వెళ్లాలి. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలి.
* అనుమానిత లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి.
* వ్యాక్సిన్ వేయించుకున్నవారూ మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాల్సిందే.
తొలి కేసు నమోదై ఏడాది
రాష్ట్రంలో తొలి కరోనా కేసు సరిగ్గా ఏడాది క్రితం... 2020 మార్చి 12న నెల్లూరులో అధికారికంగా నమోదైంది. అప్పటినుంచి 2021 మార్చి 12 వరకు రాష్ట్రంలో 8,91,388 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,180 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,227 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.