school food: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు రాకపోవడం.. గ్యాస్ ధరలు కొండెక్కడం.. నిత్యావసర ధరలు పెరగడంతో వంట ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వంట నిర్వాహకులకు చాలా మందికి ఆగస్టు 16 నుంచి ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. కొందరికి గౌరవ వేతనం రూ.3వేలు సరిగా రావడం లేదు. బిల్లులు ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో వారు అప్పులు చేసి పిల్లలకు వడ్డిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల అన్నం, పులిహోర, వెజిటెబుల్ రైస్‌లాంటి వాటిని కట్టెల పొయ్యిపైనే వండుతున్నారు.
వడ్డించడం ఎలా?
మధ్యాహ్న భోజనం వంట, గౌరవ వేతనం కలిపి సుమారు రూ.250కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. కొన్నిచోట్ల 1-8 తరగతుల వారికి పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి బిల్లులు ఇవ్వకపోగా.. 9, 10 తరగతులకు కొంతవరకు బకాయిలున్నాయి. బకాయిలు పెరగడంతో అరువుపై సరకులు ఇచ్చేందుకు కిరాణా దుకాణాల యజమానులు నిరాకరిస్తున్నారని, వడ్డీకి అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తోందని వంట కార్మికులు వాపోతున్నారు. బిల్లులను ఆలస్యంగా ఇవ్వడంవల్ల వడ్డీలు, దుకాణ యజమానులు వేసుకునే అధిక ధరలకే సరిపోతాయని, వండి పెట్టిన శ్రమ వృథాగా మారుతోందని పేర్కొంటున్నారు. నెలకు ఇచ్చే రూ.3వేల గౌరవ వేతనం సకాలంలో విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వంట చేసి, వడ్డించడం ఇబ్బందిగా మారుతోందని పేర్కొంటున్నారు. కొందరికి మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులు సైతం చెల్లించలేదు. కొన్ని బడుల్లో మధ్యాహ్న భోజనంపై కొందరు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. గుంటూరు జిల్లా సాతులూరు పాఠశాలలో 70శాతం విద్యార్థులు తింటుండగా.. 20శాతం మంది ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. మరో 10శాతం సమీపంలోని ఇళ్లకు వెళ్లి తింటున్నారు. కొన్ని బడుల్లో భోజనం తినేందుకు సదుపాయం సక్రమంగా లేకపోవడంతో ఆరుబయట కూర్చోవాల్సిన పరిస్థితి.