దేవదాయశాఖలో నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయి. కోట్లాది రూపాయల రాబడి ఉండే పలు ప్రధాన ఆలయాలకు రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు.. అర్హత లేకపోయినా సరే ఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రధాన ఆలయాలకు దేవదాయశాఖలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌లు ఈవోలుగా ఉండాలి. ఒకవేళ ఆ అర్హత కలిగిన అధికారులు లేకపోతే.. రెవెన్యూశాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను డిప్యూటేషన్‌పై ఈ ఆలయాలకు ఈవోలుగా నియమించేందుకు వీలుంది. కానీ శ్రీకాళహస్తి, కాణిపాకం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల ఆలయాలకు చాలా కాలంగా రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన డిప్యూటీ కలెక్టర్లు ఈవోలుగా పనిచేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లు ఆరేళ్లు సర్వీసు చేసిన తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అవుతారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ కలెక్టర్లనే ఆలయాలకు ఈవోలుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. దీన్ని హైకోర్టులో ఒకరు సవాల్ చేయడంతో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
అర్హత లేకున్నా ఆలయాల్లో తిష్ఠ... కోర్టు కేసుతో దిద్దుబాటు చర్యలు - ap updates
కోట్లాది రూపాయల రాబడి ఉండే దేవాలయాల్లో అర్హత లేకున్నా కొందరు ఈవోలుగా ఏళ్లతరబడి తిష్టవేస్తున్నారు. రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారు 3, 4 చోట్ల విధులు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ప్రభుత్వం వారిని విధుల నుంచి తప్పిస్తోంది.
హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ద్వారకాతిరుమల ఈవో సుబ్బారెడ్డిని గత నెలలోనే మాతృశాఖకు పంపగా...శనివారం శ్రీకాళహస్తి ఈవో పెద్దిరాజు, కాణిపాకం ఈవో వెంకటేశును ఈవోలుగా తప్పించి డిప్యూటీ కలెక్టర్లుగా వేరేచోట్ల పోస్టింగ్‌లు ఇచ్చారు. సింహాచలం ఈవో సూర్యకళ, శ్రీశైలం ఈవో లవణ్నను కూడా త్వరలో బదిలీ చేయనున్నారు. దేవదాయశాఖలో సహాయ కమిషనర్ క్యాడర్ ఉండే ఆలయాలకు ఈవోలుగా ఇతరశాఖల అధికారులను నియమించకూడదనే కచ్చితమైన నిబంధన ఉంది. కానీ సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలో చక్రాయపేట మండలంలోని ప్రఖ్యాతిగాంచిన గండి ఆంజనేయస్వామి ఆలయానికి ఎంపీడీవోగా పనిచేసిన అధికారిని డిప్యూటేషన్‌పై కొంత కాలం కిందట ఈవోగా నియమించారు. ఏసీలుగా రెవెన్యూశాఖ అధికారులను కూడా తీసుకోరాదనే నిబంధన ఉంటే, పంచాయత్‌రాజ్‌శాఖ అధికారికి అక్కడ అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి:అప్రకటిత విద్యుత్ కోతలు... ఇన్వర్టర్లకు పెరిగిన గిరాకీ