తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు సంబంధించిన వివరాలు అధికార వర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. సంతోష్ నేతృత్వంలోని మన బలగాలు సాగించిన వీరోచిత పోరాటమది. గల్వాన్ ప్రాంతంలో ‘16 బిహార్’ రెజిమెంట్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ దళానికి కర్నల్ సంతోష్ బాబు కమాండింగ్ అధికారి (సీవో)గా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రెండు దేశాలూ పోటాపోటీగా అక్కడికి బలగాలను తరలించాయి. అక్కడ వేడిని చల్లార్చేందుకు ఈ నెల 6న రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి.
అందులో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు బలగాలను వెనక్కి తరలించాలి. ఇందులో భాగంగా గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14 (పీపీ-14) నుంచి చైనా సైనిక ఉపసంహరణ జరగాలి. దీన్ని పర్యవేక్షించే బాధ్యతను భారత సైనిక నాయకత్వం.. కర్నల్ సంతోష్ నేతృత్వంలోని ‘16 బిహార్’ దళానికి అప్పగించింది.
ఖాళీ చేసినట్లే చేసి..
చైనా సైనికులు తొలుత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. తమ శిబిరాలనూ తొలగించారు. ఈ అంశంపై స్థానిక చైనా కమాండర్‌తో కర్నల్ సంతోష్ బాబు చర్చలు కూడా జరిపారు. అయితే అకస్మాత్తుగా ఈ నెల 14న చైనా సైన్యం అక్కడ ఒక సరిహద్దు పరిశీలన కేంద్రంను, మరికొన్ని గుడారాలను ఏర్పాటుచేసింది. ఒప్పందం మేరకు దీన్ని తొలగించాలన్న సందేశంతో చిన్న గస్తీ బృందాన్ని ‘16 బిహార్’ దళం పంపింది. డ్రాగన్ దళాలు దీనికి ససేమిరా అన్నాయి. మన గస్తీ బృందం ఈ విషయాన్ని సంతోష్ బాబుకు తెలియజేసింది. భారత బృందం వచ్చి వెళ్లాక.. చైనా సైనికులు అక్కడికి భారీగా అదనపు బలగాలను రప్పించారు.
రంగంలోకి సంతోష్
చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలోని బృందం ఈ నెల 15న చైనా శిబిరం వద్దకు వెళ్లింది. అక్కడ స్థానిక చైనా బలగాలు కాకుండా కొత్త ముఖాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. పాతవారు సంతోష్‌కు తెలుసు. అదనపు బలగాలను చైనా పంపినట్లు ఆయన గుర్తించారు. అబ్జర్వేషన్ పోస్ట్, ఇతర గుడారాలను అక్కడ ఏర్పాటు చేయడం అక్రమమని పొరుగు దేశపు కమాండర్‌కు సంతోష్ స్పష్టంచేశారు. అయితే చైనా సైనికుడొకరు ఆయనను బలంగా వెనక్కి తోసేశారు.
మన సైనికుల్లో ఆగ్రహం
తమ ‘సీవో సాబ్’పై జులుం ప్రదర్శించడంతో భారత సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా సైనికులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పోరు అర గంటపాటు సాగింది. ఇరుపక్షాలకు చెందిన అనేక మంది గాయపడ్డారు. అంతిమంగా మన బలగాలదే పైచేయి అయింది. భారత సైనికులు.. చైనా గుడారాలను నేలకూల్చడమే కాకుండా, వాటిని కాల్చి బూడిద చేశారు. గత్యంతరం లేక డ్రాగన్ దళాలు వెనుదిరిగాయి.