ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలను సేకరించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఇళ్ల పట్టాలు, ఇసుక, ఉపాధిహామీ పనులు, కొవిడ్ అంశాలపై సమీక్షించారు. ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.7500 కోట్లు ఖర్చుచేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నామని వివరించారు. ఆగస్టు 15 నాటికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్న ఆయన.. ఇళ్లపట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని...దీనిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కొరత అనే మాట వినిపించొద్దు...
'వచ్చే వారం పదిరోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్ చేయాలి. ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్ కలెక్టర్లు దీనిమీద దృష్టిపెట్టాలి.వచ్చే 10 రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో పెద్ద ఎత్తున నిల్వచేయాలి. నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలి. ఇసుకను పంపిణీ చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలకు చెడ్డపేరు వస్తుంది. కలెక్టర్లు చర్యలు తీసుకుని బ్యాక్‌లాగ్ తీర్చడంతోపాటు, స్టాక్ యార్డుల్లో పూర్తిగా నిల్వచేసేలా చూడాలి. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపించకూడదు' - సీఎం జగన్