మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 2015లోనే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని.. సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని కేసీఆర్ వెల్లడించారు. ప్రకృతి వనాలకు ఎంతో విశిష్టత ఉంటుందని ఆయన అసెంబ్లీలో తెలిపారు.
తెలంగాణలో మొత్తం భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉండగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 66 లక్షలకుపైగా అటవీ భూములు ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులను మాయం చేశారని.. కళ్ల ముందే అడవులు ధ్వంసమయ్యాయని సీఎం ఆక్షేపించారు. రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ చేసుకోవాలని సూచించారు. 2.30 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పంతో కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. గతంలో మొక్కల సమీకరణలో చాలా ఇబ్బందులు ఉండేవని... మన దగ్గర నర్సరీలు ఉండేవి కావని సీఎం తెలిపారు. ప్రస్తుతం నర్సరీలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి కృషి చేయాలన్నారు. వేర్ల మొక్కల ద్వారా అడవుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. అటవీశాఖ సాయంతో పంచాయతీ సిబ్బంది నర్సరీలను పెంచుతున్నారన్నారు. రాష్ట్రంలో 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్న కేసీఆర్.. గతంలో పల్లె ప్రకృతి వనం ఒక్కటి కూడా ఉండేది కాదన్నారు. గతంలో పార్కు అంటే గ్రామాల్లో తెలిసేది కాదని... 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెరుగుతున్నాయన్నారు. 53 అర్బన్ పార్కుల్లో పనులు బాగా జరిగాయని సీఎం కేసీఆర్ వివరించారు. మిగతా ప్రాంతాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికితే రూ.4 లక్షల జరిమానా విధించారని సీఎం గుర్తు చేశారు. పర్యావరణాన్ని రక్షించాలంటే మొక్కల పెంపకాన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉంది. హరిత నిధికి తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారు. హరితనిధికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాం. హరితనిధి ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాప్రతినిధులు హరిత నిధి కింద రూ.500 ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులందరూ వారి జీతం నుంచి ప్రతి నెల గ్రీన్ ఫండ్‌గా రూ.100 ఇచ్చేందుకు అంగీకరించారు. రాష్ట్రంలోని ఐపీఎస్‌లు కూడా ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రతి నెలా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హరిత నిధికి జమ చేస్తారు. మిగతా పక్షాలు కూడా హరితనిధికి ముందుకు రావాలి. హరితనిధి విషయమై ప్రతిపాదనలు కూడా వచ్చాయి. -కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి