ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TELANGANA CM KCR: 'ఎవరెన్ని మాట్లాడినా.. మా​ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు' - సిరిసిల్లలో సీఎం కేసీఆర్​

"చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే.. ఎవరెన్ని మాట్లాడినా కేసీఆర్​ ప్రయాణాన్ని ఆపలేరు. ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల.. త్వరలోనే పరిపూర్ణం కాబోతోంది. లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం దిశగా పోతున్నాం. ఎటు చూసినా కాకతీయ, కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతూ.. పచ్చదనంతో పరిఢవిల్లుతూ.. ధాన్యపు రాశులతో విలసిల్లుతోంది." అని తెలంగాణలోని సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్​ ప్రసంగించారు.

cm kcr
'ఎవరెన్ని మాట్లాడినా.. మా​ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు'

By

Published : Jul 4, 2021, 5:11 PM IST

ఎవరెన్ని మాట్లాడినా.. తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉద్ఘాటించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్‌ ఏర్పాటవడం చాలా సంతోషమని.. జిల్లా వాసులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని దుర్మార్గంగా వాదించేవారని గుర్తుచేశారు. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లక్ష్యం ఏర్పాటు చేసుకుని.. ఆ లక్ష్యం దిశగా పోతున్నామన్నారు.

ఎటు చూసినా ధాన్యపు రాశులే..

"రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. 92 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్​సీఐకి ఇచ్చినం. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. వలస వెళ్లిన రైతులందరూ వాపస్​ వస్తున్నారు. పాత ఇళ్లను సర్ధుకుంటున్నారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేశాం. ఇంకో నాలుగు వేల కోట్లతో త్వరలోనే రెండో విడతలో గొర్రెల పంపిణీ చేయనున్నాం. తెలంగాణ రాకముందు అధ్వానంగా ఉన్న మత్యకారుల పరిస్థితి.. ఇప్పుడు మెరుగైంది. తెలంగాణ తన పునాదిని తాను బలంగా చేసుకుంటోంది."

- కేసీఆర్​

మిషన్​ కాకతీయ వారి ఆలోచనే..

"రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలు పెట్టిన మొదటి కార్యక్రమం మిషన్‌ కాకతీయ. మిషన్​ కాకతీయ అనే పేరు తెలంగాణ వచ్చాక పెట్టింది కాదు. ఆ పేరు పెట్టిన ఇద్దరు మహానుభావులు స్వర్గస్తులయ్యారు. ఒకరు ప్రొఫెసర్​ జయశంకర్​, మరొకరు ఆర్​.విద్యాసాగర్. వారి​తో కలిసి తెలంగాణ గురించి పరితపిస్తున్న సమయంలో అర్ధరాత్రనక, అపరాత్రనక.. తెలంగాణ గురించి చర్చించేవాళ్లం. ఆ సమయంలో ఆ ఇద్దరు చెప్పిన మాటల స్ఫూర్తితోనే మిషన్​ కాకతీయకు శ్రీకారం చుట్టాం."

- కేసీఆర్

భూగర్భజలాలు పెరిగాయి..

రాష్ట్రంలో గత రెండేళ్లలో 135 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయని సీఎం తెలిపారు. మిషన్‌ కాకతీయలో చేపట్టిన ఏ ఒక్క చెరువు గట్టు తెగలేదన్నారు. చెరువులన్నీ కళకళలాడుతున్నాయని చెప్పారు. పొలాలకు నీళ్లందుతున్నాయని తెలిపారు. భూగర్భజలాలు మీటర్లకు మీటర్లే పెరుగుతున్నాయంటే దానికి కారణం మిషన్​ కాకతీయనే అని సీఎం పేర్కొన్నారు. రూ.15 వేల కోట్లు అయినా కాళేశ్వరం కడతానని అసెంబ్లీలో చెప్పానని.. ఇప్పుడు అది సుసాధ్యం చేసి ప్రశ్నించిన వాళ్లకు సమాధానం చెప్పామని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

సజీవ జలధారగా మారిన కరీంనగర్​..

"రాబోయే కొద్ది రోజుల్లోనే కరీంనగర్​ సజీవ జలధారగా తయారవుతుందని చెప్పినప్పుడు.. ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు అది నిజమైంది. ఎగువమానేరు నుంచి మధ్యమానేరు, కరీంనగర్​, మంథని వద్ద గోదారిలో కలిసే సుమారు 175 కిలోమీటర్లు వరకు సజీవ జలధారగా మారింది. ఏప్రిల్‌లో అప్పర్‌ మానేరు నిండుతుందని ఎవరూ అనుకోలేదు. వరద కాలువతో బాల్కొండ నుంచి చొప్పదండి వరకున్న 110 కిలోమీటర్ల వరకు సాగు నీళ్లందుతున్నాయి. మూడో సజీవ జలధార కాకతీయ కాలువ. ఎనిమిదిన్నర నెలలు కాకతీయ కాలువ పారుతూనే ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్లు గోదావరి సజీవం అయ్యింది."

-కేసీఆర్

మస్తు పైసలేశినా..

"గోదావరిలో నేను వెసినన్ని నాణేలు ఎవరు వేసి ఉండరు. అటు వెళ్లేటప్పుడు.. ఇట్టు పోయేటప్పుడు.. అమ్మా గోదారమ్మా.. మా ఊర్లళ్లకు ఎప్పుడు వస్తావమ్మా అని వేడుకునే వాన్ని. చిన్నప్పుడు మా పెద్దలు చెప్పిర్రు. నీళ్లల్ల నాణేలేస్తే పుణ్యమని. అందుకే.. మొక్కి పైసలేశేవాన్ని. ఇప్పుడు అందుకేనేమో గోదారమ్మ మన తెలంగాణను ముద్దాడుతోంది."

-కేసీఆర్​

ఇదీ చూడండి:

'నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి'

ABOUT THE AUTHOR

...view details