'అట్ల నేనెప్పుడు అన్న..నేను అనలే'..కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్.. ఇస్తాంబుల్‌లాగా ఎదగాలని కలలు కనటం తప్పా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr Speech in Assembly) ప్రశ్నించారు. కలలు కంటాం, వాటిని నేరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో వరదలు, ముంపునకు కారణం కాంగ్రెస్ కాదా అని దుయ్యబట్టారు. నగరం అంటే కొన్నాళ్లలో నిర్మించేది కాదన్న సీఎం... వందల ఏళ్లుగా హైదరాబాద్ క్రమంగా విస్తరిస్తోందని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా విరాజిల్లుతోందన్నారు.
నగరాల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగినట్లు సీఎం పేర్కొన్నారు. ఎన్నిసార్లు అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లో వరదలు, ముంపునకు కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్.. డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు బాగుచేయలేదన్నారు. హైదరాబాద్‌లో మొత్తం డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాలంటే రూ.15 వేల కోట్లు అవసరమని చెప్పారు.
నేను అలా అనలేదే...
హైదరాబాద్.. ఇస్తాంబుల్‌లాగా ఎదగాలని కలలు కనటం తప్పా అని కేసీఆర్ అడిగారు. కలలు కంటాం, వాటిని నేరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. కరీంనగర్‌ను డల్లాస్‌లాగా చేస్తానని అనలేదని స్పష్టం చేశారు. కరీంనగర్ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయని... తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ కూడా డల్లాస్‌లాగా కనిపిస్తుందని మాత్రమే చెప్పినట్లు సీఎం చెప్పారు.
హైదరాబాద్ పాతనగరంను ఇస్తాంబుల్ చేస్తమన్నరు. మీకేమో కలలు కనే ధైర్యం లేకపాయే. మేము కలలు కూడా కనొద్దా? జనాన్ని పాజిటివ్ లైన్లా తీసుకుపోవద్దా? ఇదెక్కడి దౌర్భాగ్యమండి. హైదరాబాద్ పాతనగరాన్ని ఇస్తాంబుల్‌లా కావాలని కోరుకోవద్దా? తప్పా? ఇదెక్కడి దుర్మార్గమండి. ఫేజ్ మ్యానర్‌లో అయితది. వెయిట్ చేయండి. కరీంనగర్ పోయినపుడు చెప్పినమండి. డల్లాస్ చేస్తమని అనలేదు. నేను చెప్పింది ఎగ్జాట్‌గా ఏంటంటే... మంత్రి... వగైరా వగైరా కూర్చుంటే సార్ మాకు రోప్ వే బ్రిడ్జి కావాలే అని గంగుల కమలాకర్ అడిగారు. మానేరు నది గోదావరిల కలిసేదాకా 90 కిలోమీటర్లు ఉంటది. ఏవైతే చెక్‌డ్యాంలు మంజూరు చేస్తున్నామో... సిరీస్ ఆఫ్ చెక్‌డ్యాంలు కట్టండి. వాటిలో చిన్న బోట్స్ పోయే వే పెట్టుకున్నట్లు అయితే... రోప్ వే బ్రిడ్జ్ పూర్తయితే లండన్ నగరంలో థేమ్స్ నది ఎలా కనిపిస్తదో మీ కరీంనగర్ కూడా అట్ల అయితదయ్య అని చెప్పిన. ఇది తప్పా? కరీంనగర్ డల్లాస్... డల్లాస్ అమెరికాలో ఉంటది. నేను చెప్పింది లండన్. డల్లాస్ చేస్తా అని నేనేందుకు చెప్పిన మేం చెప్తమా అట్లాంటి డొల్ల కబుర్లు.
--తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్
ఇదీ చూడండి: ఈ మూడు నెలలు జాగ్రత్త.. లేదంటే అంతే!