CM KCR Sensational Comments: దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమయ్యారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సుమారు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. జాతీయ, కర్ణాటక రాజకీయాలతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని చెప్పారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో కర్ణాటకకు వచ్చినప్పుడు తాను చెప్పిన మాట నిజమైందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకకు వచ్చిన సమయంలో.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పి వెళ్లానని.. అది అక్షరాల నిజమైందని వివరించారు. ఇప్పుడు కూడా జాతీయస్థాయిలో పెనుమార్పు రాబోతోందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు నెలల్లోనే ఓ సంచలన వార్త చెప్తామన్నారు.