Cm Kcr Mumbai Tour: కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముంబయి పర్యటనకు వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన నివాసంలో భేటీ అవుతారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌నూ కలుస్తారు. సీఎం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరి వెళ్తారు. ఆయన వెంట ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తదితరులు ఉంటారు.
ఇద్దరు సీఎంలు బుధవారం ఫోన్‌లో ఇప్పటికే ప్రాథమికంగా చర్చించుకున్నారు. కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలన, విధానాలు, రాష్ట్రాలపట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ సరైన సమయంలో గళం విప్పారని ఠాక్రే.. కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడటానికి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని కోరారు. దీనిపై చర్చించేందుకు ముంబయి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబయిలోని ఠాక్రే నివాసం వర్షలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తారు. అక్కడే ఉభయులూ భోజనం చేస్తారు.
వార్ధా బ్యారేజీ నిర్మాణంపైనా చర్చ!
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భాజపా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ సైతం భాజపాపై ధ్వజమెత్తుతున్నారు. విభజన హామీలు నెరవేర్చకపోవడం, ధాన్యం కొనుగోళ్లపై సహాయనిరాకరణ తదితర సందర్భాల్లో కేంద్రం వైఖరిని తెరాస నిరసించింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు రాగా సీఎం దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటిపై కేసీఆర్, ఠాక్రేలు మాట్లాడుకొని... భాజపాపై ఎదురుదాడికి ప్రణాళిక రూపొందించే వీలుంది.
దీంతో పాటు గోదావరి నదిపై వార్ధా బ్యారేజీ నిర్మాణంపైనా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో తక్కువ ముంపుతో కూడిన వార్ధా వద్ద బ్యారేజీ నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదించింది. నిర్మాణాలు చేపడతామని కేసీఆర్ తెలియజేయనున్నారు.