తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగిందని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. శాలపల్లి నుంచే రైతుబంధు ప్రారంభించానని.. ఆ పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించానని గుర్తుచేశారు. అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుడుతున్నామని సీఎం చెప్పారు. దళితబంధు ఒక ఉద్యమంగా సాగాలని.. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలని సీఎం స్పష్టం చేశారు. నాలుగేళ్లలో దళితబంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండు నెలల్లో హుజూరాబాద్‌లో అందరికి దళిత బంధు డబ్బులిస్తామని చెప్పారు.
తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిననాడు.. ఎన్నో అపోహలు, అనుమానాలు తలెత్తినట్లు చెప్పారు. అవన్నీ దాటుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు చెప్పారు. ఇదో కేవలం ప్రభుత్వం పథకం కింద మాత్రమే మిగిలిపోకూడదన్నారు.