CM KCR Comments on Lockdown: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మాస్క్ ధరించడం సహా కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా కొవిడ్‌ను నియంత్రించవచ్చన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదన్న అధికారులు... కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారులు నివేదించారు.
నిబంధనలు పాటించాలి..
Corona cases in Telangana: ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న సీఎం... అజాగ్రత్త పనికిరాదని, నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కొవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
విద్యాసంస్థలకు సెలవులు..
Holidays for schools in Telangana: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండగ కోసం పాఠశాలలు, కొన్ని విద్యాసంస్థలకు ఈ నెల 11 నుంచి సెలవులు ప్రకటించారు. మరికొన్ని విద్యాసంస్థలు మూడు లేదా నాలుగు రోజుల సెలవులు ప్రకటించాయి. కొవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విద్యాసంస్థలకు ఎనిమిదో తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
100 శాతం ఆక్సీజన్ పడకలుగా..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దాదాపు 99 శాతం పడకలను ఇప్పటికే ఆక్సిజన్ పడకలుగా మార్చారని... మిగిలిన ఆ ఒక్క శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ పడకలుగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మెట్రిక్ టన్నుల నుంచి 324 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు తెలిపిన సీఎం... దాన్ని500 మెట్రిక్ టన్నుల వరకు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లు 20 లక్షల నుంచి కోటి వరకు... ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలన్న సీఎం... ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధానాలను రూపొందించాలని చెప్పారు.