Increased pension distribution by cm jagan: వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద రూ.250 చొప్పున పెంచిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 1న గుంటూరు జిల్లా పెదనందిపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. పింఛనును రూ.2,500కు పెంచిన వివరాలతో కూడిన పోస్టర్లనూ ఆయన అక్కడే ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే రోజు జిల్లా స్థాయిల్లో సంబంధిత జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సభలకు సంబంధిత ఎమ్మెల్యేలు హాజరయ్యేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
పెంపుదల ఇలా..
వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులకు ఇచ్చే పింఛన్ల మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు నెల నుంచే ఈ పెంపుదల వర్తించనుండగా జనవరి 1వ తేదీన పెరిగిన మొత్తంతో పింఛను ఇవ్వనున్నారు. అదనంగా రూ.250లు పెంచడం వల్ల ప్రభుత్వంపై రూ.129 కోట్ల భారం పడనుంది. మరోవైపు కొత్తగా 1.41 లక్షల మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.