రాష్ట్రంలో నిర్దిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలు అందకపోతే పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. స్పందన కార్యక్రమం, వివిధ అంశాలపై ఆయన.. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలినాని, సురేశ్, సీఎస్, డీజీపీ పాల్గొన్నారు. కొత్త లబ్ధిదారులతో కలిపి 30.3 లక్షల మందికి జులై 8న ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించిన జగన్.. వారికి బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలన్నారు.
3 లక్షల టన్నుల ఉత్తత్తే లక్ష్యం
రోజుకు 3 లక్షల టన్నులు ఇసుక ఉత్పత్తి చేసేలా రీచ్‌లు తెరవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇసుక, మద్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. వర్షాలు వచ్చేనాటికి 70 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయాలని నిర్దేశించారు. ఈ నెలాఖరు కల్లా రోజుకు 3 లక్షల టన్నుల ఉత్తత్తి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో.. కొత్త సోర్స్‌లు కూడా గుర్తించి అక్కడ రీచ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేపట్టాలన్న సీఎం.. గ్రామస్థులు పక్కనున్న రీచ్‌ల నుంచి ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు.
60 లక్షల మందికి పని కల్పించాలి
ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే సమీక్షా సమావేశం నాటికి 60 లక్షల మందికి పని కల్పించాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. ప్రస్తుతం 54.5 లక్షల మంది ఉపాధి పనులకు వస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ - క్రాప్ విధానం కీలకం
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర పొందేందుకు ఈ - క్రాప్ బుకింగ్ విధానం చాలా కీలకమని సీఎం తెలిపారు. ఇది 100 శాతం కచ్చితత్వంతో జరగాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీన్ని వ్యవసాయ, రెవెన్యూ అసిస్టెంట్ చేయించాలని సూచించారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఈ – క్రాప్ బుకింగ్ పునాదన్న ఆయన.. ప్రకృతి వైపరీత్యాలు, పంట రుణాలు, బీమాకు ఈ విధానం వల్ల ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు.